Chandrababu Naidu: ప్రతి ఒక్కరికి ఇల్లు..ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక వేత్త

ప్రతి ఒక్కరికీ ఇల్లు, ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక వేత్త లక్ష్యంగా సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల పంపిణీ ప్రారంభం.

Chandrababu Naidu

అమరావతి: ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక వేత్త తయారు కావాలని.. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని..ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన ప్రజావేదిక సభలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. 2029కి ప్రతి పేదవాడికి సొంతిళ్లు ఉండాలని..ప్రతి ఇల్లు పారిశ్రామిక వేత్తలకు నెలవు కావాలన్న ప్రభుత్వ ఆశయాన్ని సాధించేందుకు కనిగిరిలో నిన్న ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించాం… ఇవాళ పేదలకు ఇళ్లు ఇస్తున్నాం అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభిస్తాం. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తాం అన్నారు. రూ.50 వేల కోట్లు డ్వాక్రా మహిళలు అప్పులు తీసుకుంటున్నారు… బాధ్యతగా తిరిగి చెల్లిస్తున్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాలు ముందుకెళ్తున్నాయి. మీరు ఏం చేయాలనుకున్నా శిక్షణ ఇప్పిస్తాం అన్ని తెలిపారు. పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీఆర్.కూడు, గూడు, గుడ్డ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ. మీ అందరికీ హామీ ఇస్తున్నా… ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఇచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఉగాదికి మరో 5.8లక్షల గృహ ప్రవేశాలు

17 నెలల్లో నిధులు లేకపోయినా నిలదొక్కుకుని 3,00,192 ఇళ్లు పూర్తి చేశాం అని చంద్రబాబు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన-బీఎల్సీ కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లలో లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారని, మిగిలిన 5.8 లక్షల ఇళ్లు మార్చిలోపు పూర్తి చేయించి ఉగాదికి గృహ ప్రవేశాలు చేయిస్తాం అన్నారు. 2014-19 మధ్య 8 లక్షల ఇళ్లు పూర్తి చేశాం… రూ. 16 వేల కోట్లు ఖర్చు చేశాం అని తెలిపారు. గత పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు… ఆర్థికంగా దివాళా తీయించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. కేంద్ర పథకాలకు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు అని చంద్రబాబు ఆరోపించారు. ఇటువంటి మంచి పథకాలను గత ప్రభుత్వం నిలిపేసింది… కేంద్రం ఇచ్చే నిధులు తీసుకోకపోతే నష్టపోయేది పేదలేనన్నారు. కేంద్ర నిధులతోనే మైక్రో ఇరిగేషన్ తెచ్చాం… ఈ ప్రాంతంలో కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుని రైతులు దర్జాగా ఉన్నారని… 90 శాతం సబ్సీడీ ఇచ్చాం… ఎస్టీ, ఎస్సీలకు ఉచితంగా ఇచ్చాం అని గుర్తు చేశారు.

వైసీపీ పాలకులు గ‌ృహ నిర్మాణ రంగాన్ని చిరిగిన విస్తరి చేశారు

గత ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని గత పాలకులు కుక్కలు చింపిన విస్తరిలా చేసిందని..4.73 లక్షల ఇల్లు రద్దు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. 2.73 లక్షల మంది ఇళ్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వలేదు.. రూ. 900 కోట్లు ఎగ్గొట్టారని చంద్రబాబు విమర్శించారు. బకాయి పడ్డ రూ. 900 కోట్లను కూటమి ప్రభుత్వం అందించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఉచితం అని చెప్పిన గత ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు… ఇళ్ల నిర్మాణాలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. మేం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రంతాల్లో 3 సెంట్లు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం అర్బన్ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు మాత్రమే ఇచ్చారు… అవి కూడా ఊరికి దూరంగా కొండులు, గుట్టల్లో ఇచ్చారు. వాటికి కూడా చదును పేరుతో కోట్లు ఖర్చు పెట్టి దోచుకున్నారు. ఆ సెంటు పట్టాలు ఇచ్చిన చోట కనీసం రోడ్డు, నీళ్లు కూడా లేవు.
పేదలకు ఇవ్వాల్సిన ఇసుకను కూడా పందికొక్కుల్లా తిన్నారు. పేదల పేరు చెప్పి ఇసుకను దోచుకున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. గత పాలకులు తాగునీటి పథకాలను కూడా నాశనం చేశారని..పులివెందులకు కూడా నీళ్లివ్వలేదని చంద్రబాబు విమర్శించారు. పులివెందులలోని ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇస్తాం.కేంద్ర జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూళాయి ద్వారా నీరివ్వాలని నిర్ణయించిందన్నారు.

డిసెంబర్ 1నాటికి సొంతిళ్లు లేని వారికి ఇండ్లు

గృహ నిర్మాణాలకు కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇస్తున్నామని..పట్టణాల్లో కేంద్రం రూ.2.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఇస్తుందని.. దీనికి అదనంగా బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ప్రిమిటివ్ గిరిజనులకు రూ.1 లక్ష ఇప్పటికే ఇస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు.
ఇకపై గృహ నిర్మాణాలకు బీసీ, ఎస్సీలకు ఇచ్చినట్టే ముస్లింలకు కూడా రూ.50 వేలు అదనంగా ఇస్తాం. దాదాపు 6 లక్షల మంది ఇళ్లు కట్టుకునే స్థోమత లేక నిర్మాణాలు నిలిపేశారు. వీరికి ప్రభుత్వం అందించే సాయం కారణంగా రూ.3,220 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. బీసీల్లో 3.75 లక్షల కుటుంబాలకు, ఎస్సీల్లో 1.57, ఎస్టీలకు 46వేలు, 22 వేల ఆదివాసీ కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, ఉగాది రోజున మరో 5.9 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తాం.
ఇల్లు లేని పేదలను గుర్తిస్తున్నాం. డిసెంబర్ 1వ తేదీన నాటికి రాష్ట్రంలో ఇంకా సొంతిళ్లు లేని పేదలను గుర్తించాలని ఆదేశించామని…అర్హులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఉమ్మడి కుటుంబ సభ్యులకు కలిపి ఇళ్ల మంజూరు

ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తున్నాం. కుటుంబ పెద్దలకు, వారి కుమారులకు కలిపి కూడా ఉమ్మడి ఇల్లు నిర్మిస్తాం..కుటుంబం కలిసి ఉండాలి… కలిసుంటేనే కలదు సుఖం. విడిపోతే అన్నీ సమస్యలేనని చంద్రబాబు హితవు పలికారు. సొంత స్థలం ఉన్నవారి ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తాం… లేని వారికి స్థలం కేటాయిస్తాం.
పట్టణ ప్రాంతాల్లోని వారికి 1 ప్లస్ 2, 3 విధానంలో అపార్టమెంట్ కట్టి సదుపాయాలు కల్పిస్తాం.ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకునేందుకు సోలార్ ఏర్పాటు చేస్తాం. ఎస్టీ, ఎస్సీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తాం. బీసీలకు సబ్సిడీ ఇస్తాం.ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి… మీరు ఏ పని కావాలన్నా ఇంటి నుంచే చేయాలి. మన ఇంటిపైనుంచే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఏర్పడింది. రైతులు ముందుకొచ్చి విద్యుత్ తయారు చేస్తామంటే సోలార్ ప్యానెళ్లు పెట్టుకుని తయారు చేసుకోవచ్చు. పంపుసెట్లకు పోను మిగిలిన విద్యుత్ గ్రిడ్ కొనుగోలు చేస్తుంది. విద్యుత్ వినియోగదారులు ఉత్పత్తి దారులుగా మారాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.5,700 విలువైన నాలుగు బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఫ్యాన్లు అందిస్తున్నామని గుర్తు చేశారు. నా తల్లి పడ్డ కష్టాలు చూసి ముఖ్యమంత్రి అయ్యాక దీపం గ్యాస్ సిలిండర్ పథకం పెట్టాను. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను… ఇప్పుడు దీపం-2.0 పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అని తెలిపారు.