Site icon vidhaatha

ఏపీ నుంచి 42 వేల టన్నుల అరటి ఎగుమతులు

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2020-21లో 42 వేల 935 మెట్రిక్‌ టన్నుల అరటి పళ్ళు ఎగుమతి అయినట్లు వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేసే గ్రాండ్‌-9 అరటి పళ్ళకు విదేశాలలో మంచి డిమాండ్‌ ఉన్న విషయం వాస్తవమేనా అని రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. అరటి వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం నిరంతరం జరిగే ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు.
అగ్రికల్చరల్, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రాడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అపెడా) వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. అరటి ఎగుమతులను ప్రోత్సహించడానికి అపెడా పలు చర్యలు చేపడుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానం కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాను ఎగుమతులకు అనువైన అరటి సాగుకు సానుకూలమైన ప్రాంతాలుగా అపెడా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి అరటి ఎగుమతుల కోసం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. జాతీయ పరిశోధనా సంస్థలు, ఉద్యానవన విశ్వవిద్యాలయాల సహకారంతో అరటి సాగును ప్రోత్సహిస్తోంది. ఎగుమతులు చేయగల సామర్ధ్యం కలిగిన వారిని కూడగడుతోంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సర్టిఫికేషన్‌కు అవసరమైన సాగు విధానాలను అమలు చేస్తోంది. అలాగే క్రయ-విక్రయదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపిక చేసిన అరటి సాగు క్లస్టర్లలో నూరు శాథ టిస్యూ కల్చర్‌ అరటిని సాగు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. అరటి ఎగుమతుల రవాణాకు వీలుగా ముంబైలోని పోర్టుకు నేరుగా ప్రత్యేక రైలును ప్రవేశపెట్టినట్లు మంత్రి వివరించారు.

Exit mobile version