అమరావతి : ఏపీలో ఖరీఫ్ సీజన్ కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 37 మండలాలను కరువు పీడిత మండలాలుగా పేర్కొంది. అందులో అన్నమయ్య జిల్లాలో 9 మండలాలను, సత్యసాయి జిల్లాలో 25 మండలాలను, ప్రకాశం జిల్లాలో 3 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రకటించిన కరువు మండలాల్లో 12మండలాల్లో తీవ్రమైన, 25మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది.
గత ఖరీఫ్ సీజన్‌లోనూ ప్రభుత్వం 49 కరువు మండలాలను ప్రకటించింది. గడిచిన రబీ సీజన్‌లో ఆరు జిల్లాల పరిధిలోని 51 మండలాల్లో కరువు ఉన్నట్లు నిర్ధారించింది. వాటిలోని 37 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉండగా.. 14 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది. తాజా ఖరీఫ్ సీజన్ లో 37మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది.
