Site icon vidhaatha

Andhra Pradesh : ఏపీ రైతులకు గుడ్ న్యూస్: త్వరలోనే ఆ కార్డులు…

Andhra pradesh Soil health cards

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు త్వరలోనే భూ ఆరోగ్య కార్డులను పంపిణీ చేయనుంది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఈ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు ముందు రైతుల భూముల్లో భూమి నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షించి ఆయా భూముల్లో ఏ రకమైన పంటలు వేస్తే ప్రయోజనం ఉంటుందనే దానిపై ఈ కార్డుల్లో సిఫారసు చేస్తారు. దీని ఆధారంగా పంటలు వేస్తే ప్రయోజనం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే ఇప్పటివరకు ఈ పరీక్షలు పూర్తి చేసిన భూములకు సంబంధించిన రైతులకు భూ ఆరోగ్య కార్డులను పంపిణీ చేయనున్నారు.కొన్ని చోట్ల రైతుల భూముల్లో మట్టి నమూనాలను సేకరించలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున కొన్ని చోట్ల నిలిచిపోయిన మట్టి నమూనాల సేకరణను సీజన్ పూర్తైన తర్వాత సేకరించి ఆరోగ్య కార్డులను పంపిణీ చేస్తారు. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భూఆరోగ్య కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ జిల్లాలో మట్టి నమూనాలు పూర్తి చేసిన రైతులకు సంబంధించిన కార్డులు వ్యవసాయ కార్యాలయాలకు చేరాయి. వీటిని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంపిణీ చేయనున్నారు.

మట్టి నమూనాలను పరిశీలించిన తర్వాత ఆ భూమికి అనుగుణంగా పంటలు వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తారు. అదే విధంగా ఎరువుల వాడకంలో కూడా సూచనలు చేస్తారు. దీని ఆధారంగా పంటలు పండిస్తే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఒకే రకమైన పంటలను పండించడం కంటే పంట మార్పిడి ద్వారా కూడా పంటల దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. పంటలకు ప్రభుత్వం పెట్టుబడి సహాయం కూడా అందిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

శరీరంలో ఏమైనా లోపాలున్నాయో తెలుసుకునేందుకు రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు. అదే తరహాలో భూమిలో ఏ రకమైన ఖనిజాల లోపాలున్నాయి… ఆ భూమిలో ఏ రకమైన పంటలు పండిస్తే ప్రయోజనం అనేది ఈ భూహెల్త్ కార్డుల్లో వివరిస్తారు.

 

Exit mobile version