Site icon vidhaatha

దుర్గ గుడిలో నేటి నుంచి అషాడ ఉత్సవాలు .. జూలై 6 నుంచి 15 వరకు వారాహి నవరాత్రులు

విధాత : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో.. నేటి నుంచి రెండు ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. జూలై 6 నుంచి 15 వరకు వారాహి నవరాత్రులు నిర్వహించనున్నారు. కనకదుర్గ ఆలయ అధికారులు వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి. మరోవైపు.. నేటి నుంచి దుర్గగుడిలో ఆషాఢం సారె మహోత్సవాలు నిర్వహించబోతున్నారు… ఆలయంలోని ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాట్లు చేశారు.. సారె ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆ తరువాత జూలై 19 (ఆషాడ శుద్ధ త్రయోదశి) నుండి జూలై 21 (ఆషాడ శుద్ధ పౌర్ణమి) వరకు శాకంబరీ దేవి ఉత్సవాలను నిర్వహించనున్నారు. శాఖంబరీ ఉత్సవాలకు కావాల్సిన కూరగాయలు భక్తులు సమర్పించడానికి ముందుకు వస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆషాఢ సారె మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది. కదంబం ప్రసాదంగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయ ఈవో రామారావు వెల్లడించారు. వారాహి నవరాత్రుల్లో భాగంగా వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం నిర్వహిస్తారు. 14వ తేదీన మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. కనకదుర్గమ్మ ఆలయంలో బోనాలు సమర్పణకు విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 26న ఇంద్రకీలాద్రి నుంచి భాగ్యనగరం మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలకు పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుందన్నారు. అయితే, కనకదుర్గమ్మ ఉన్న ఇంద్రకీలాద్రిపై సనాతనంగా ఉన్న శివలింగం స్వర్ణమయమైంది. అత్యంత పురాతన ఆలయం పూర్తిగా అభివృద్ధి జరిగింది. మహానివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటారు.. ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించారు. 11:45 నుంచి 12:15 వరకూ మహా నివేదన ఉంటుంది.. 11:30 నుంచి 1:30 వరకూ ప్రోటోకాల్ దర్శనాలు ఉండవు. సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు.

Exit mobile version