అమరావతి : 19మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతైన కర్నూల్ జిల్లా చిన్నటేకూర్ వి.కావేరి బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్టు వెలుగు చూసింది. నిన్నటిదాక బైకర్ ను ఢీకొట్టిన బస్సు బైక్ ను ఈడ్చుకెళ్లడంతో చెలరేగిన మంటల కారణంగా ప్రమాదానికి గురైందని భావించిన దానికి భిన్నంగా కొత్త కారణాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు ప్రమాదం, బైక్ ప్రమాదాలు రెండు వేర్వేరు అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
పెట్రోల్ బంక్ సీసీ టీవీ ఫుటేజీలో బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉండటం..అక్కడే బైక్ స్కిడ్ అయి పడిపోబోవడం కనిపించింది. అక్కడి నుంచి తన స్నేహితుడు ఎర్రి స్వామితో కలిసి శివశంకర్ బైక్ మీద బయలు దేరాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శివశంకర్ రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టి రోడ్డుపై జారీ పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలకు గురైన శివశంకర్ స్పాట్ లోనే మృతి చెందాడు.
రోడ్డుపైన పడిపోయిన బైక్ ను, శివశంకర్ ను పక్కకు లాగేందుకు ఎర్రి స్వామి ప్రయత్నిస్తుండగానే..అదే సమయంలో కావేరి బస్సు వేగంగా వచ్చి బైక్ మీదుగా దూసుకెళ్లింది. మృతదేహంతో పాటు బైక్ ఆ బస్సు కింది భాగాన ఇరుక్కుంది. బస్సు డ్రైవర్ అలాగే 300మీటర్లు వెళ్లడంతో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలి రోడ్డుపై నిప్పురవ్వలతో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు బస్సులోకి వ్యాపించడం..బస్సులోని చిన్న సిలిండర్ పేలి డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రాణ నష్టం అధికమైంది. అంతేగాక బస్సులోని 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సల్ మంటల్లో కాలి అందులోని సెల్ ఫోన్ల బ్యాటరీలు పేలడంతో ప్రయాణికులు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది.
