Road Accident : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరవకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. మరో నలుగురిని బలి తీసుకుంది. అనంతపురం (Anantapuram) జిల్లా గుత్తి సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆ కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని సంగమేశ్వర్ నగర్‌కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి అనంతపురం కారులో బయలుదేరారు. మార్గమధ్యలో గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్ దాబా వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న లారీ ఆ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు పదేళ్ల వయసున్న చిన్నారులు ఉన్నారు.
ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఈ ఘటనపై గుత్తి సీఐ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 27న ఇంట్లో పెళ్లి ఉండటంతో పెళ్లి బట్టల కోసం హైదరాద్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.