- ప్రపంచస్థాయి ప్రమాణాలతో కడతాం
- మళ్లీ రాజధాని ప్రారంభానికి మోదీ
- అమరావతి కోసం రైతుల వీరోచితపోరు
- వారి కృషితోనే పనులు పునః ప్రారంభం
- అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు
Amaravathi | ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని..ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకు ఈ నగరమే ప్రతిరూపమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో మూడు సంవత్సరాలలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. మళ్ళీ మోదీ రాజధాని ప్రారంభోత్సవానికి వస్తారని చంద్రబాబు ప్రకటించారు. 30శాతం పచ్చదనం..జలవనరులతో ఆహ్లదకరంగా నవ నగరాలతో అమరావతి నగరాన్ని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టు, ఎడ్యూకేషన్ హబ్, హెల్త్ సిటీని నిర్మిస్తామన్నరు. జపాన్ మియవాకీ తరహాలో కాలుష్యరహిత రాజధానిగా రూపొందిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 29 వేల మంది రైతులు ఏకంగా 34వేల ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే.. దేశానికే కాదు.. ప్రపంచానికే ఇదో చరిత్ర అన్నారు. అలాంటి అమరావతి నగర నిర్మాణం తలపెడితే.. గత ఐదేళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశామన్నారు. అమరావతి కోసం రైతులు వీరోచితంగా పోరాడారని..మీ పోరాటం వల్లే అమరావతి పునః ప్రారంభమైందని చెప్పారు. అమరావతి రైతులు సాగించిన ఉద్యమాన్ని నా చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. మళ్లీ చూస్తానని కూడా నమ్మకంలేదని. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు.
ప్రజాతీర్పుతోనే అమరావతికి ఊపిరి
2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజాతీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందని చంద్రబాబు తెలిపారు. పది నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్రం సహకారం, మోదీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించామన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకొనేలా నిర్మిస్తాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. మేం అధికారంలోకి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరంగా ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నేను నాలుగోసారి సీఎం.. కానీ, ఎటు చూసినా అగాథమేనన్నారు. అలాంటి సమయంలో వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్రం, వ్యక్తిగతంగా ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారన్నారు. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాం. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం.. ఇంకా కొన్నిరోజుల పాటు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నా అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాజధానితో పాటు 26జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనేక కంపెనీలు వస్తున్నాయని గుర్తు చేశారు.
ఉగ్రవాదంపై పోరులో మీకు అండగా ఉంటాం
అమరావతి పునఃప్రారంభోత్సవం ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగిన రోజు అని చంద్రబాబు తెలిపారు. గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని..గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. మళ్లీ మోదీ చేతుల మీదుగానే పునఃప్రారంభమవుతున్నాయన్నారు. గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారన్నారు. ఇటీవల కలిసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారని..పహల్గామ్ లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఆయన ఉన్నారన్నారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకూ అండగా ఉంటామన్నారు. మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామని తెలిపారు. మోదీజీ.. మేమంతా మీకు అండగా ఉన్నాం. వందేమాతరం.. భారత్ మాతాకీ జై అంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. ప్రజలతోనూ సీఎం నినాదాలు చేయించారు.
కులగణనపై మోదీ నిర్ణయం గొప్పది
సరైన సమయంలో.. సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని..ప్రపంచ వ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉండేది. ప్రస్తుతం ఐదో స్థానానికి ఎదిగిందన్నారు. త్వరలోనే మూడో స్థానానికి చేరుతుందన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని..ఒకవైపు అభివృద్ధి మరోవైపు పేదరిక నిర్మూలనకు మోదీ కృషి చేస్తున్నారన్నారు. కులగణన చేయాలని ఇటీవల మోదీ నిర్ణయం తీసుకున్నారని..ఇదో గొప్ప నిర్ణయం’’ అని ప్రశంసించారు. దేశంలో డిజిటైలేషన్, పారిశ్రామిక, శాస్త్రా సాంకేతిక రంగాల్లో నరేంద్ర మోదీ అభివృద్ధి ఆదర్శనీయమన్నారు.