అప్పులపై అసెంబ్లీ వేదికగా అసత్య ప్రచారాలు
డైవర్టు రాజకీయాలలో ఆయన దిట్ట
సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఫైర్
జగన్ ఉండుంటే అన్న చర్చ మొదలైందని వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్ : శ్వేత పత్రాల విడుదల పేరుతో వైసీపీ ఐదేళ్ల సంక్షేమ పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను దాచి అసత్య ప్రచారంతో నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా వైసీపీ పాలనలో అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రూ. 14 లక్షల కోట్లు అప్పుచేశారని ఆరోపించిన టీడీపీ, గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లు అప్పులని వినిపించారని దుయ్యబట్టారు. వాస్తవానికి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు రూ. 5.18 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రోజు రూ. 100 కోట్లు మాత్రమే నిలువ ఉందని గుర్తు చేశారు. కరోనా ఉండి రెండు సంవత్సరాలు ఆదాయం లేకున్నా.. కేంద్రం అప్పులకి పర్మిషన్ ఇచ్చినా చంద్రబాబు ప్రభుత్వం (2014-19) కన్నా మేము తక్కువ అప్పులు చేశామన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని మేం అమలు చేశామని, డీబీటీ ద్వారా బటన్ నొక్కి రూ. 2.71 లక్షల కోట్లు లబ్దిదారులకు జమ చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయవలిసి వస్తుందన్న భయంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను చంద్రబాబు ప్రవేశపెట్టడం లేదని, రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు.
డైవర్ట్ రాజకీయాల్లో దిట్ట
చంద్రబాబు డ్రైవర్ట్ రాజకీయాలలో దిట్ట అని, దేన్నైనా దృష్టి మళ్లించడంలో చంద్రబాబు ఎక్సపర్ట్ అని వైఎస్ జగన్ విమర్శించారు. మదనపల్లె ఘటన జరిగిన రోజే టీడీపీ వ్యక్తి చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్పించేందుకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీశాను, దానిని డ్రైవర్ట్ చేయడానికి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనను హైలెట్ చేసుకున్నారని మండిపడ్డారు “పెద్దిరెడ్డి, మిధునరెడ్డి ఏదో చేశారంటున్నారని, ఆర్డీవో కార్యాలయంలో ఏదో జరిగితే.. ఎమ్మార్వో, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆ డాక్యుమెంట్లు ఉంటాయని, ఆన్ లైన్‌లో ఆ డాక్యుమెంట్లు ఉంటాయి కదా అని గుర్తు చేశారు. పెద్దిరెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యే, మిథున్‌రెడ్డి మూడుసార్లు ఎంపీ, ప్రజలు ఊరికే వాళ్లను గెలిపించలేదని, వాళ్లను అభాసుపాలు చేయాలనే ఇదంతా చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, నారా లోకేష్ ఏకంగా రెడ్‌బుక్ ప్రదర్శిస్తూ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. రాష్ట్రమంతా హోర్డింగులు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో చెప్పాలన్నారు. మధనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే, డిజీపీని హెలికాప్టర్ లో పంపిన చంద్రబాబు., నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమైతే.. చివరకు ఆమె బాడీ ఇంకా దొక్కపోయినా, ప్రభుత్వం స్పందించలేదన్నారు. సగం దర్యాప్తులో ఉండగానే ఎస్పీని బదిలీ చేశారని, ఒక అనుమానితుడు లాకప్ డెత్‌కు బలైయ్యాడని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 45 రోజుల్లో 12 మందిపై అత్యాచారాలు జరిగాయన్నారు. మా ప్రభుత్వ హయాంలో దిశా పోలీస్ స్టేషన్లు, దిశా యాప్ మహిళలకు ఒక వరంలా ఉండేదని చెప్పుకొచ్చారు. మాకు మంచిపేరు వస్తదని చెప్పి వాటిని ఇప్పుడు పని చేయకుండా చేశారన్నారు.
సూపర్ సిక్స్ ఏమైంది?
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైంది? అందులో ప్రకటించిన పథకాలు ఏమయ్యాయని జగన్ ప్రశ్నించారు. తల్లికి వందనం లేదు? మూడు ఉచిత సిలిండర్లు లేవు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఏమయ్యాయి? ఆ వివరాలు ఉన్నాయి కదా?, ఓటర్ల జాబితాలో 18 ఏళ్లు నిండిన వారి ఉంటారు? ఆ జాబితా చాలు కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండి ఉంటే అమ్మఒడి ఇప్పటికే వచ్చేదని, రైతు భరోసా సహా అన్ని పథకాలు అందేవన్న చర్చ మొదలైందని జగన్ చెప్పుకొచ్చారు. తల్లికీ వందనం అని చెప్పి అందరినీ మోసం చేశారని, ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ డబ్బులు ఇస్తామని ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయ్యిందని, విద్యార్థుల డేటా అంటూ కాలం గడుపుతున్నారని, తల్లికి వందనం అని పేరు పెట్టి శరగోపం పెట్టారని జగన్ విమర్శించారు. రైతులకు రూ.20వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పాడు. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మా ప్రభుత్వంలో మేము ఒక్క రైతుభరోసా కింది రూ.34,378 కోట్లు ఇచ్చాం. వైఎస్ జగన్ ఉంటే మాకు ఇన్సూరెన్స్ వచ్చేదని రైతులు భావిస్తున్నారు. రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పటికి చంద్రబాబు కట్టలేదు. మేము కట్టాల్సిన ఇన్సూరెన్స్ను కోడ్ ఉందని వారే ఆపించారని జగన్ ఆరోపించారు. మేము గతంలో ప్రతీ ఎకరాకు ఇన్సూరెన్స్ చేశామని, జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు. జూన్ 43 లక్షల మంది తల్లులకు పథకంలో నిధులు జమ అయి ఉండేవని, ఏమన్నా అంటే వివరాలు సక్రమంగా లేవంటారని, 50 రోజులైందని, ఇంకా డేటా ఏమిటి, అమ్మ ఒడి (తల్లికి వందనం) కోసం 43 లక్షల తల్లులు, 82 లక్షల పిల్లలు ఎదురుచూస్తున్నారన్నారు. ఇప్పటికి విద్యాదీవెన కింది ఒక త్రైమాసిక ఫీజు వచ్చి ఉండేదని, అలాగే, వసతి దీవెన కింద పిల్లలకు ఒక విడత లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద ఆర్థిక సాయం అంది ఉండేదని జగన్ గుర్తు చేశారు.