విధాత ప్రత్యేకం: ఏపీలో రెండోసారి అధికారం కోసం ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత వైఎస్ జగన్ కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగులకు ఎక్కువ సీట్లివ్వడం ఆ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక కారణమని భావిస్తున్న తరుణంలో ఏపీలో సుమారు 50 నుంచి 80 సీట్లలో ఈసారి కొత్త ముఖాలకు అవకాశమివ్వాలని జగన్ నిర్ణయించారని తెలుస్తున్నది. గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేయాలనుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా సీనియర్లు – మంత్రులకు షాకులు ఇస్తున్నారు. తాజాగా 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించిన సీఎం జగన్.. మరో 36 నియోజకవర్గాల్లోనూ మార్పులకు సిద్ధం అయినట్లు సమాచారం.
తొలి దెబ్బ ముగ్గురు మంత్రులపై!
జగన్ మార్పులు మొదలుపెట్టిన తొలి జాబితాలోనే ముగ్గురు మంత్రులు (విడుదల రజనీ, ఆదిమూలపు సురేశ్, మేరుగ నాగార్జున) వారి నియోజకవర్గాలను కోల్పోయారు. రెండో విడతలో మరో ఆరుగురు మంత్రుల విషయంలోనూ ఇదే తరహా షాకులు ఉంటాయని తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలోని రెండు జిల్లాలకు చెందిన మంత్రులు.. ఉత్తరాంధ్ర, గోదవరి జిల్లాల్లోని మరో నలుగురు మంత్రులకు స్థాన చలనం తప్పదని చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే వారికి సమాచారం కూడా చేరిపోయిందంటున్నారు.
బీసీకార్డుతో గెలుపు వ్యూహం!
తెలుగుదేశం పార్టీకి బీసీ ఓట్లు వెన్నెముకగా చెబుతారు. సరిగ్గా ఇప్పుడు బీసీ ఓట్లనే టార్గెట్‌గా జగన్ అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారని తెలుస్తున్నది. మంగళగిరి నియోజకవర్గంలో రెండుసార్లు నారా లోకేశ్‌ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈసారి పక్కనబెట్టి బీసీ (పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని జగన్ రంగంలోకి దించుతున్నారు. ఇదే ఫార్ములాను పలుచోట్ల ఉపయోగించి తానే అసలైన బీసీ బంధు అని చెప్పడం వైసీపీ లక్ష్యంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.
ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనిని చిలకలూరి పేట అసెంబ్లీ నుంచి మార్చి గుంటూరు పశ్చిమకు మార్చారు. అదే విధంగా పవన్ కల్యాణ్ పై గాజువాకలో గెలిచిన తిప్పారెడ్డి నాగిరెడ్డిని, అతని కుమారున్ని కాదని బీసీ అభ్యర్థిని ఎంపిక చేశారు. రేపల్లెలో టీడీపీలో మంత్రిగా పని చేసిన ఈపూరు సీతారావమ్మ కుమారుడు డాక్టర్ గణేష్‌ను ఎంపిక చేశారని సమాచారం.
ఎంపీ స్థానాలపైనా ప్రత్యేక గురి
ఇటు అసెంబ్లీ – అటు పార్లమెంటు సీట్లలో ప్రతిపక్షాలపై గత ఎన్నికల తరహాలో పైచేయి సాధించాలన్నది జగన్ లక్ష్యంగా చెబుతున్నారు. అందుకే సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని అంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో ఈసారి ఏపీలో ప్రతిపక్షం బలం భారీగా పెరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల జగన్ పార్టీ ఊహించని విధంగా 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేస్తుండటంతో జగన్ మరింత వ్యూహాత్మకంగా అభ్యర్థులను బరిలోకి దింపాల్సి వస్తోంది. ప్రతిపక్షం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఊహించని అభ్యర్థులను తెరమీదకు తెచ్చే ప్రణాళికలు జగన్ వేసుకున్నారని చెబుతున్నారు.
వైసీపీకి చెందిన ప్రస్తుత ఎంపీలను కొందరిని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి, కొందరు సీనియర్లను లోక్ సభకు పంపాలని సీఎం జగన్ దాదాపు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ను నిడుదవోలు ఎమ్మెల్యేగా, రాజమండ్రి ఎంపీగా మంత్రి చెల్లుబోయిన వేణు లేదా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే వంగా గీత మాత్రం ఈసారి కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్నారు. చలమల శెట్టి సునీల్ కూడా రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. గుంటూరు, విజయవాడ స్థానాల్లో పార్లమెంటు అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ పెద్ద కసరత్తే చేస్తున్నారట. అమరావతిని రాజధానిగా కొనసాగించకపోవడంతో ఈ రెండు జిల్లాల్లో వైసీపీపట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి చోట సీట్లు గెలవడం చాలా వ్యయ, ప్రయాసలతో కూడినది. అందుకే బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలన్న ఎత్తుగడలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లా నర్సరావు పేట నుంచి ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి టికెట్ ఇస్తారని అంటున్నారు.
ఏలూరు ఎంపీ స్థానంలో కోటగిరి శ్రీధర్ స్థానంలో బోళ్ల రాజీవ్ పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. నరసాపురం నుంచి దివంగత క్రిష్ణంరాజు సతీమణి శ్యామలను పోటీలో నిలిపేందుకు ఇప్పటికే మిథున్ రెడ్డి సంప్రదింపులు చేస్తున్నారు. ఈ స్థానం నుంచి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ రఘురామ కృష్ణంరాజు నిలబడుతున్నారని, ఎలాగైనా ఆయన్ను ఓడించాలన్నది వైసీపీ లక్ష్యంగా చెబుతున్నారు.
శ్యామల ఆసక్తిగా లేకపోతే గోకరాజు రామరాజు పేరును జగన్ పరిశీలిస్తున్నారు. ఒంగోలు నుంచి కరణం బలరాంను , హిందూపురం నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను ఎంపీగా పోటీ చేయించే అంశం పైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఎస్ దీపికరెడ్డి పేరు ఖాయమైందంటున్నారు. ఈమె టిడిపి తరఫున బరిలో నిలుస్తున్న నందమూరి బాలకృష్ణకు ఎంతమాత్రం పోటీ ఇస్తారనేది ఆసక్తిగా మారనుంది.
తిరుపతి, కడప, నంద్యాల, రాజంపేట, మచిలీపట్నం ఎంపీల స్థానాల్లో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని పేర్లు పరిశీలిస్తుండగా, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పేరు ఖాయమైందని చెబుతున్నారు.