అమరావతి : తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న మొంథా తుపాన్(Cyclone Montha) క్రమంగా బలహీనపడుతుంది(weaked) . మంగళవారం అర్ధరాత్రి నర్సాపురం దగ్గర 12కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన ‘మొంథా’ తుఫాను వాయుగుండంగా మారి బుధవారం బలహీన పడుతుంది. అయితే తుపాన్ కారణంగా మరో 24గంటలు అంతటా భారీ నుంచి మోస్తారు వర్షాలు కొనసాగనున్నాయని వాతావారణ శాఖ వెల్లడించింది. మొంథా ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్షాలు జోరుగా పడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తుఫాన్ ప్రభావం కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధిక ప్రభావం చూపుతుంది. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పోర్టులను మూసివేశారు. పలు రైళ్లను, విమానాలను రద్దు చేశారు. విద్యా సంస్థల బంద్ కొనసాగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై వరద నీరు ఏరులై పారుతోంది. అనంతగిరి సమీపంలో రోడ్డుపై ఉధృతంగా వరద నీరు సాగుతుంది. మొంథా తుఫాను ప్రభావం కారణంగా ఈదురుగాలులకు భారీ వృక్షాలు కూలిపోగా.. విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఈదురుగాలులకు చల్లపల్లి-మచిలీపట్నం ప్రధాన రహదారిపై చెట్లు నేలకొరిగాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట-ఎస్.రాయవరం మండలం గోకులపాడు 16వ జాతీయ రహదారిపై కూలిన భారీ చెట్టు కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయివిశాఖలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. హైదరాబాద్ – శ్రీశైలం మధ్య వరద ఉదృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఘాట్ రోడ్డులో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. జేసీబీ సాయంతో కొండచరియలను తొలగించే చర్యలు చేపట్టారు. బొర్రా కేవ్స్ మధ్య రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. విశాఖ రైల్వే డివిజన్ యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. 63వ కి.మీ వద్ద ట్రాకుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. బొర్రా, చిమిడిపల్లి రైల్వేస్టేషన్ మధ్య ట్రాక్‌పై వర్షపు నీరు నిలిచింది. తెలంగాణలో మహబూబ్ బాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పై వరద నీటితో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంతో సహా పలు జిల్లాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఖమ్మం, పాలేరు, భద్రాచలం, సత్తుపల్లిలో భారీ వర్షం పడుతుంది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
