Site icon vidhaatha

Pawan Kalyan | అర్జీలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ .. పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

విధాత : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను శనివారం పరిశీలించారు. ఉదయం నుంచీ పవన్ కల్యాణ్‌ తన కార్యాలయ సిబ్బందితో కలసి ప్రతి అర్జీని చదివారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతోపాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్నపలు సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కల్యాణ్‌ దృష్టికి తీసుకువచ్చారు. వచ్చిన ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతోపాటు, సమస్య తీవ్రతనుబట్టి అధికారులకు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియచేసిన సమస్య పవన్‌ను కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు.

అదే విధంగా యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలుపెట్టడం, ఇళ్లపై రాళ్ళు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సదరు యువకులు వివరాలు, బైక్స్ పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. ఆ యువకులను పట్టుకొని హెచ్చరిస్తే ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామని బెదిరించారని తెలిపారు. ఆ యువకులు ఒక మహిళా ఎస్సైని సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్‌ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఆడ పిల్లలను, మహిళలను వేధించేవారిపై కఠినంగా వ్యవహరించాలి అని స్పష్టం చేశారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని తగు చర్యలు తీసుకొంటామని తిరుపతి ఎస్పీ బదులిచ్చారు.

Exit mobile version