పది గేట్లు 18 అడుగులు ఎత్తి నీటి విడుదల
జూరాల, తుంగభద్ర నుంచి భారీగా వరద
ఇన్ఫ్లో 4.64 లక్షల క్యూసెక్కులు..
అవుట్ ఫ్లో 4.91 క్యూసెక్కులు
జోరుగా జల విద్యుత్తు ఉత్పత్తి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులన్నీ నీటి తో కళకళలాడుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి వరద తీవ్రత పెరగడంతో జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం భారీగా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టును నిండు కుండలా చేసిన నదీమతల్లి నాగార్జునసాగర్ వైపు బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణవేణి ప్రవాహ ధాటికి శ్రీశైలం గేట్లు మరిన్ని తెరుచుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో సోమవారం మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. మంగళవారం రాత్రి పది గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు. బుధవారం వరద కొంచం తగ్గడంతో రెండు గేట్లు మూసివేసి ఎనిమిది గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. మళ్ళీ అదే రోజు రాత్రి భారీగా వరద పెరగడంతో మళ్ళీ పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం పది గేట్లను 18 అడుగుల వరకు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. గురువారం వరద తగ్గుతుందని ప్రాజెక్టు అధికారులు అనుకున్నారు. కానీ బుధవారం రాత్రి వరద ప్రవాహం భారీగా పెరగడంతో ప్రాజెక్టు పది గేట్లు ఎత్తారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4.64 క్యూ సెక్కుల నీటి ప్రవాహం ఉంది. ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్కు 4.91 లక్షల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 883.80 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885.8 అడుగులు ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205.70 టీఎంసీల నిలువ ఉంచారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇంకా వారం పది రోజులు వరద ప్రవాహం ఇలాగే ఉంటే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి లో నిండే అవకాశం ఉంది.