విధాత : ఉమ్మడి రాష్ట్ర పాలకులతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం కారణంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో కృష్ణాజలాలు జిల్లా వాసులకు అందకుండా పోతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. నాగర్ కర్నూల్ జనం బాటలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరులో 308కిల్లోమీటర్లు పారుతున్న కృష్ణా జలాల్లో 550 టీఎంసీల కృష్ణా నీటిని తెలంగాణకు రావాల్సి ఉందని..గత లెక్కల మేరకు 299టీఎంసీలను సైతం వినియోగించుకోవాలంటే నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి, కొడంగల్ సహా అన్ని ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 25లక్షల ఎకరాల సాగు భూముుల్లో కేవలం తెలంగాణ వచ్చాక 12ఏళ్లలో 6.50లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించారన్నారు. కాంగ్రెస్ వచ్చి రెండేళ్లు అవుతున్నా అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో.. వృధా వరద నీళ్లను వినియోగించుకునేందుకు మేం ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని ఏపీ వాదిస్తుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో బీఆర్ఎస్ 90టీఎంసీలతో మొదలు పెట్టిందని..కాని కాళేశ్వరానికి ప్రాధాన్యతనిచ్చి ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్నారు. కేవలం ఒక పంప్ ను ఆన్ చేశారన్నారు. మిగతా పనులు జరుగకపోవడంతో సాగునీటి సరఫరా లక్ష్యం నెరవేరలేదన్నారు. ప్రాజెక్టు కట్టి ఉంటే 100టీఎంసీలు మనకు హక్కుగా వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 45టీఎంసీలు చాలని ఇప్పుడు లేఖ ఇవ్వడంతో మరింత అన్యాయం చేసిందన్నారు. గత ప్రభుత్వం కూడా అన్ని అనుమతులు తేలేకపోయిందన్నారు.
జూరాల మాత్రమే పాలమూరుకు లైఫ్ లైన్
పాలమూరు రంగారెడ్డిలో 21ప్యాకెజీలకు 18ప్యాకేజీలు మాత్రమే పని జరుగుతుందని, పదేళ్లలో 10సార్లు సర్వే చేసి 10కోట్లు చెల్లించారని..కాని నేటికి డిండి ఎత్తిపోతలకు వాటర్ సోర్స్ పాయింట్ ఖరారు చేయలేదన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో తట్టేడు మట్టి కూడా ఎత్తి పోయలేదన్నారు. ఇంతలోనే సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల తెచ్చి పాలమూరు రంగారెడ్డి పరిధిలో చేర్చి బీమా నుంచి నీటిని తీసుకుంటున్నారన్నారు. కేవలం గురువు చంద్రబాబును సంతృప్తి పరిచేందుకే రేవంత్ రెడ్డి జూరాల నుంచి కాకుండా బీమా నుంచి కొడంగల్ ఎత్తిపోతలకు నీరు తీసుకుంటున్నారని, పాలమూరు ప్రాజెక్టులను పడకేయించారని కవిత ఆరోపించారు. జిల్లా బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రాజెక్టుల పూర్తికి నిధులు ఇవ్వలేదని, కేవలం భూ సేకరణ దశలో ఉన్న కొడంగల్ ఎత్తిపోతలకు 4.300కోట్లు ఇచ్చారని, అందులో మేఘా, పొంగులేటిలకు రూ1000కోట్ల చొప్పున అడ్వాన్స్ ఇచ్చి మళ్లీ అడ్వాన్స్ మొబలైజేషన్ పద్దతి తెచ్చి దోపిడికి తెరలేపారన్నారు. శ్రీశైలం నుంచి పాలమూరు ప్రాజెక్టులకు నీళ్లు తీసుకోవడం ద్వారా అంతర్ రాష్ట్ర జలవివాదాలు ఎదురవుతున్నాయని, అందుకే జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని జాగృతి కోరుతుందన్నారు. జూరాల వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మించాలని కోరుతుందని తెలిపారు. జూరాల మాత్రమే పాలమూరు ప్రాజెక్టులకు లైఫ్ లైన్ అని కవిత చెప్పుకొచ్చారు.
హరీష్ రావు నిర్వాకంతోనే కల్వకుర్తికి అన్యాయం
వట్టెం రిజర్వాయర్ లో చెరువు నుంచి నల్లమట్టిని తెచ్చి పోశారని, మట్టి కోసం రైతుల నుంచి సేకరించిన 900ఎకరాలను కాంట్రాక్టులు కబ్జా పెట్టారని, ప్రభుత్వానికి దమ్ముంటే వాటిని తిరిగి రైతులకు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో ఎల్లూరు పంప్ హౌజ్ ను ఓపెన్ గా నిర్మించకుండా గ్రౌండ్ లో నిర్మించేందుకు హరీష్ రావు నిర్ణయించి బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో రెండు మోటార్లు రిపేరైపోయాయని కవిత విమర్శించారు. కల్వకుర్తిలో కేవలం మూడు మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని, ఇందుకు హరీష్ రావు నిర్వాకమే కారణమని కవిత ఆరోపించారు.
ఏపీ జలదోపిడితో పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుందని, వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల హాయంలో ఏపీ పొతిరెడ్డి పాడు ద్వారా 45వేల క్యూసెక్కులను 80వేల క్యూసెక్కులకు పెంచి జల దోపిడి చేస్తున్నారన్నారు. రాయలసీమ ఎత్తిపోతలతో మరింత అన్యాయం చేస్తున్నారని, దీనిపై జాగృతి స్టే సాధించారని గుర్తు చేశారు. బనకచర్ల స్థానంలో నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు తెచ్చి 200టీఎంసీలను తరలించే ప్రయత్నం ఏపీ చేస్తుందని..ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని జాగృతి డిమాండ్ చేస్తుందని కవిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
Naga Babu | మహిళలు మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి.. చర్చకు దారి తీసిన నాగబాబు స్టేట్‌మెంట్
Chiru-Venki | చిరు, వెంకీ క్రేజీ స్టెప్.. రెండు కళ్లు సరిపోవడం లేదుగా.. ప్రోమో విడుదల
