Site icon vidhaatha

వైఎస్సార్‌కు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతల నివాళులు

విధాత : దివంగత సీఎం వైఎస్‌. రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లాలోని ఇడుపుల పాయలో వైస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి తన తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి నివాలులర్పించారు. తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వారితో వైఎస్‌ విమలమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.ఈ సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మ, జగన్‌ను కౌగిలించుకొని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. అనంతరం తల్లిని ఆయన సముదాయించారు. జగన్‌పై ఆయన మేనత్త విమలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌ దేవుడిపై ఆధారపడ్డారని విమలమ్మ అన్నారు.

జగన్‌ ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించే శక్తిని జగన్‌కు ఆ దేవుడు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జగన్‌ తన మూడు రోజుల పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయల్దేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించాయి.

మీరు చూపిన మార్గమే మాకు శిరోధార్యమని జగన్ ట్వీట్‌

తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి 75వ పుట్టినరోజు సందర్భంగా వైసీసీ చీఫ్‌ జగన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ట్విటర్ వేదికగా ఆయన తన తండ్రిని స్మరిస్తూ ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం తమకు శిరోధార్యమన్నారు. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు తమకు మార్గమంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి.’ అని ఏపీ మాజీ సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Exit mobile version