రుషికొండపై టీడీపీ నేతల తప్పుడు ప్రచారం: మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్

రుషికొండ పై జగన్ నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి జగన్ సొంత భవనలన్నట్లుగా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని వైసీపీ నేత , మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు

  • Publish Date - June 17, 2024 / 01:48 PM IST

విధాత, హైదరాబాద్ : రుషికొండ పై జగన్ నిర్మించిన కట్టడాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి జగన్ సొంత భవనలన్నట్లుగా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని వైసీపీ నేత , మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. సోమవారం విశాఖలో అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో జగన్ ప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారని తెలిపారు.

రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలని, రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్ మోహన్ రెడ్డి ఉండరని అమరనాథ్ తెలిపారు. వాస్తవాలను చెప్పకుండా టీడీపీ నేతలు జగన్‌పై, ఆయన కుటుంబంపై బురద జల్లాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నాలుగు నెలల క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించామని, ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.

2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసునని అమరనాథ్ అన్నారు. హైదారాబాద్‌లో ఇల్లు నిర్మించుకునే సమయంలో చంద్రబాబు ప్రైవేట్ హోటల్‌లో ఉండి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండ పై శాశ్వత భవనాలు నిర్మించారన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలను తప్పు తోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలన్నారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలని గుర్తించాలన్నారు.

గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేదని అమరనాథ్ ఎద్దేవా చేశారు. రుషికొండ భవనాలు చూపించినట్లుగా జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం, మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని కూడా ప్రజలకు చూపించాలని, అలాగే వాటర్ ప్రాజెక్ట్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం, కురపం కాలేజీ, మూలపేటలో పోర్టు నిర్మాణం, పలు ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని కూడా చూపించండని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.

Latest News