విధాత:నెల్లూరు జిల్లా కృష్టపట్నంకి చెందిన బొణిగి ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు ఏపీలో సంచలనంగా మారింది. వేల సంఖ్యలో ఆయుర్వేద మందు కోసం కరోనా బాధితులు క్యూలు కట్టారు. కళ్లలో పసరు వేసిన కొద్దిసేపటికే ప్రాణం తిరిగొచ్చిందంటూ కొందరు బాధితుల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అదంతా బూటకమని కొట్టిపారేస్తున్నారు హేతువాది బాబు గోగినేని. కళ్లలో మందు వేయగానే తేరుకున్నానని చెప్పిన రిటైర్డ్ హెడ్మాస్టర్ పరిస్థితి ఇప్పుడు మరింత అధ్వానంగా తయారైందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లలో పసరు వేస్తే రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి హౌలేగాళ్లలారా? అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆనందయ్య దుకాణం వెంటనే మూయించాలంటూ ఆయన ఫేస్‌బుక్‌లో షాకింగ్ పోస్ట్ చేశారు. ఆయన ఫేస్‌బుక్ పోస్ట్ యథాతథంగా..
‘‘ వద్దూ! వద్దూ! అని హెచ్చరించినా, వారించినా చెప్పిన వాళ్ళని అందరినీ చులకనగా చేసి, వాళ్ళకు దురుద్దేశాలు అంటగట్టి మతోన్మాదం, కులోన్మాదపు పేడలో ఈదుతున్న పాగల్ గాళ్ళు అందరూ ఈ విచారకర సన్నివేశాన్ని చూడండి. ఉచితంగా ఇస్తే కరెక్ట్ అవుతదా? నిన్ననే “నాకు అద్భుతం జరిగింది, కొన్ని నిమిషాలలోనే నేను బాగైపోయాను” అన్న వీరు 24 గంటల తరువాత ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నారో చూడండి. రక్తంలో ఆక్సిజన్ 85 నుండి 95 శాతం పసరుతో ఎలా పెరుగుతుందిరా హౌలే గాళ్లలారా? ఇప్పుడు 75% ఉంది అంటే ఆయన ఎంత ప్రమాదంలో ఉన్నారో అర్ధం అవుతుందా వెధవల్లారా? మీరు ఎంతమంది ప్రాణాలను ముప్పులోకి నెట్టారు రా మూఢులారా?’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆస్పత్రుల్లో దోపిడీ జరుగుతోంది నిజమే.. కానీ అది వేరే యుద్ధం. అంతే కానీ తప్పుడు ప్రచారం చేసి వేల మందిని రప్పించిన ఆనందయ్య, జర్నలిస్టులపై కూడా చర్యలు తీసుకోవాలని బాబు గోగినేని డిమాండ్ చేశారు.