Gorantla Butchaiah Chowdary | అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్( Protem Speaker ) గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ప్రమాణం చేశారు. బుచ్చయ్య చేత ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఇక జూన్ 21, 22 తేదీల్లో కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ( AP Assembly ) సమావేశాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్( Speaker ) గా వ్యవహరించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శుక్ర, శనివారాల్లో బుచ్చయ్య ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది.
మరోవైపు ప్రస్తుత అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తర్వాత ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమే ఉన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకూ 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గోరంట్లతో పాటుగా చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయననే స్పీకర్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత స్థానాల్లో కింజరాపు అచ్చెన్నాయుడు (6 సార్లు) ఉన్నారు.
ఎవరీ బుచ్చయ్య చౌదరి..?
గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా నరసాయపాలెం గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గోరంట్ల వీరయ్య చౌదరి, అనసూయమ్మ. బాపట్లలో ఎస్ఎల్‌సీ, రాజమండ్రిలోని వీరేశలింగం విద్యాసంస్థల్లో ఇంటర్, రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి పట్టా పుచ్చుకున్నారు.
1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరిన మొదటి వ్యక్తి బుచ్చయ్య సోదరుడు రాజేంద్రప్రసాద్, సోదరుడు ప్రోద్బలంతో ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గోదావరి జిల్లాల్లో పార్టీ కన్వీనర్ గా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేశారు.
1996లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989 ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ.. మళ్లీ 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ తెలుగు దేశం పార్టీ తరపున 1999, 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.
1994లో మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1995 వరకు నిర్వహించారు. 1995లో ఎన్టీఆర్ గద్దె దింపడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పక్షాన పోరాటం చేసి ఆయన మరణం వరకు ఆయనతోనే నడిచారు. 1996లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ తరుపున రాజమండ్రి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి నచ్చకపోవడంతో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. 1997లో చంద్రబాబు ఆహ్వానం మేరకు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. బుచ్చయ్య చౌదరి వ్యాపార రంగంలోకి ప్రవేశించి కలప, లిక్కర్, చేపల చెరువులు, నిర్మాణ రంగం,ఇలా పలు వ్యాపారాలు నిర్వహించారు.