Site icon vidhaatha

Mahesh Chandra Laddha | ఏపీ ఇంటెలిజెన్స్‌ ఛీప్‌గా మహే‌శ్‌ చంద్ర లడ్హా.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

Mahesh Chandra Laddha | ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా మహేశ్‌ చంద్ర లడ్హా నియామకయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్‌ చంద్ర 1998 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. మొన్నటి వరకు డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో కొనసాగారు. ప్రస్తుతం డెప్యూటేషన్‌ను పూర్తి చేసుకొని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. ఈ క్రమంలో ఆయనను నిఘా విభాగం చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్‌ చంద్ర లడ్హా గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ ఈస్ట్‌ జోన్ డీసీపీగానూ సేవలందించారు.

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా పని చేశారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగానూ సేవలందించారు. 2019-20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పని చేసిన ఆయన.. కేంద్ర సర్వీసుల్లోకి డెప్యూటేషన్‌పై వెళ్లారు. సీఆర్పీఎఫ్‌లో ఐజీగా నాలుగేళ్ల పాటు పని చేశారు. తాజాగా డెప్యూటేషన్‌ను ముగించుకొని రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్‌తో దాడి చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో లడ్హాతో పాటు ఆయన ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సాధారణ పౌరులు మృతి చెందారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Exit mobile version