క్వాలిటీ మద్యం విక్రయానికి పచ్చజెండా
విధాత, విజయవాడ : పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ముద్రించనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఫొటోతో ముద్రించారు. ఈ విధానాన్ని రద్దు చేస్తూ కొత్తగా ఏపీ రాజముద్రను పాస్ పుస్తకాలపై ముద్రించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం బుధవారం నాడు సచివాలయంలో సమావేశం అయ్యింది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు రెవెన్యూ అధికారులు పర్యటించి వివరాలు సేకరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 22ఏ ఫిర్యాదులపై మూడు నెలల్లో పరిష్కారం చూపాలని, అప్పటి దాకా 22ఏ భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని, ఇప్పటికే పూర్తయిన రిజిస్ట్రేషన్లపై విచారణ జరపాలని తీర్మానం చేశారు. పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖలు విడుదల చేసిన.. జిఓ నెంబర్లు 217, 144 లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అదే విధంగా రిజర్వాయర్, చెరువుల్లో బహిరంగ వేలం పాటను రద్దు చేశారు. ఈ రద్ధు మూలంగా స్థానిక మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సంబంధిత శాఖ మంత్రి వివరించారు. స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో.. ఇద్దరు పిల్లల నిబంధన మినహాయించుతూ తీర్మానం చేశారు. ఇద్దరు సంతానం మించితే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ నిబంధన మూలంగా నష్టపోతున్నామని పలువురు ఔత్సాహిక నాయకులు విన్నవించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మంజూరైన నూతన వైద్య కళాశాలల్లో 100 సీట్లతో ఎంబిబిఎస్ కోర్సులు ప్రారంభం కానున్నాయి. రానున్న అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అముల చేయాలని, అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరాకు నిర్ణయం తీసుకున్నారు. గత వైసిపి ప్రభుత్వం ఊరు పేరూ లేని మద్యం బ్రాండ్లతో విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడిన విషయం తెలిసిందే. బూమ్ బూమ్ వంటి పేర్లతో చౌక మద్యం విక్రయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగించాలని మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేశారు.
హోం శాఖ మంత్రి అనితను కలిసిన డాక్టర్ సునిత
ఏపి హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను సచివాలయంలో బుధవారం దివంగత మాజీ ఎంపి వైఎస్.వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ ఎన్.సునిత కలిశారు. ఈ సందర్భంగా తన తండ్రి వివేకా హత్యానంతరం జరిగిన పరిణాలపై ఇరువురూ చర్చించుకున్నారు. త్వరగా విచారణ పూర్తయి నిందితులకు శిక్ష పడే విధగా సహకరించాలని సునిత హోం మంత్రి అనిత ను కోరారు.