Pawan Kalyan controversy| పవన్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వం : మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ విడిపోవడానికి కోనసీమ పచ్చదనం ఓ కారణం అని..తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ పక్షాల నేతలు, మంత్రుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే సినిమాటోగ్రఫి మంత్రిగా చెబుతున్నానని.. పవన్ కల్యాణ్ సినిమాలను తెలంగాణలోని ఒక్క థియేటర్ లో కూడా ఆడనివ్వబోమని హెచ్చరించారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ విడిపోవడానికి కోనసీమ పచ్చదనం ఓ కారణం అని..తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan comments controversy)చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ పక్షాల నేతలు, మంత్రుల(Telangana ministers, Leaders criticism) నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అటు ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా పవన్ వ్యాఖ్యలు తప్పుబట్టింది. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు పిచ్చి మాటలు..అవగాహాన రాహిత్యమంటూ చురకలేశారు. అయితే తెలంగాణ రాజకీయ పక్ష నేతలు మాత్రం పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

పవన్ క్షమాపణలు చెప్పాలి..లేకపోతే ఆయన సినీమాలు ఆడనివ్వం: కోమటిరెడ్డి

తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయన్నఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే సినిమాటోగ్రఫి మంత్రిగా చెబుతున్నానని.. పవన్ కల్యాణ్ సినిమాలను తెలంగాణలోని ఒక్క థియేటర్ లో కూడా ఆడనివ్వబోమని హెచ్చరించారు. ఆంధ్ర పాలకుల కింద ఉమ్మడి రాష్ట్రంలో మేం 60 ఏళ్లు బాధపడ్డామని, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషయం తాగామని విమర్శించారు. మా నిధులు, నీళ్లు, ఉద్యోగాలు తీసుకుకెళ్ళారని, హైదరాబాద్ లో సంపాదించిన పైసలతో విజయవాడ, వైజాగ్ మిగతా ప్రాంతాలను డెవలప్ చేసుకున్నారన్నారు. ఇప్పటికి రాష్ట్ర విభజన జరిగి 13ఏళ్లు అయ్యిందని, ఇప్పుడు పవన్ కల్యాణ్ అలాంటి అనవసర వ్యాఖ్యలు చేయడం ఎందుకని మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై మా తెలంగాణ బిడ్డలు బాధపడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, మంచి చేయాలని ఉదేశంతో వచ్చి ఉంటారు.. కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అని హితవు పలికారు. చిరంజీవి మంచి వ్యక్తి…ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరన్నారు. పవన్ కళ్యణ్ క్షమాపణలు చెప్తే నైజాంలో రెండు రోజులైనా సినిమాలు ఆడుతాయని, లేదంటే సినిమా నడువదన్నారు. గత సీఎం రాష్ట్రాన్ని 7లక్షల కోట్ల అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడని, పెండింగ్ ప్రాజెక్టులు ఒక్కటి పూర్తి చేయలేదని, కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని, పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు, ఇల్లు ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వం గత పాలకులు చేసిన అప్పులు కడుతూ..పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందన్నారు. పేదలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్య ఇండ్లు అందిస్తున్నామన్నారు.
ఇలాంటి సమయంలో తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడడం కరెక్ట్ కాదు అని వెంకట్ రెడ్డి మండిపడ్డారు.

మంత్రులు పొన్నం, వాకిటి కౌంటర్

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు బాద్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. రాజకీయం అంటే సినిమా డైలాగ్ లు కాదని, మాటలతో కాకుండా మైలేజ్ తో తన పనితనం చూపించాలని హితవు పలికారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ప్రకృతి వైపరిత్యంతో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ ప్రజలపై నోరు పారేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. అలాగైతే ఆంధ్ర తీరంలోని సముద్రంలో తుపాన్ వచ్చి తెలంగాణలో వరదలతో నష్టం వస్తుందని..అప్పుడు మేం ఏపీ దిష్టి తగిలిందని అనుకోవాలా అని నిలదీశారు. ఇలాంటి అర్ధరహితమైన మాటలకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఎవరి దిష్టి ఎవరికి ఉందో ముందు పవన్ అర్దం చేసుకోవాలన్నారు. తెలంగాణపైన, హైదరాబాద్ పైన మీ దిష్టి ఉందని, ముందు నీకు సిగ్గుంటే కుటుంబంతో పాటు ఆంధ్రకు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలు ఖండనీయమని, ఆయన లేనిపోని వివాదాన్ని రాజేసుకున్నారని విమర్శించారు. రాజకీయ అనుభవం లేక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయాం అని..సోదరుల మాదిరిగా కలిసుందామని హితవు పలికారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి ఫైర్

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు పిచ్చిమాటలు అని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నుండి ఎవరూ కోనసీమకు వెళ్లి రాలేదన్నారు. ప్రతిరోజు అక్కడ నుండి వందలాది వేలాది మంది హైదరాబాద్ కు వస్తున్నారని చెప్పారు. తగిలితే వాళ్ల దిష్టే హైదరాబాద్ కు తగులుతుందని వ్యాఖ్యానించారు. మాట్లాడేటప్పుడు నాలుకకు కంట్రోల్ లేకుండా బుర్రకు పనిచెప్పకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఇంత తెలివిలేనివాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటూ చురకలేశారు.

 

Latest News