అమరావతి : మొంథా తుపాన్ ప్రభావంతో ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాల ధాటికి వరదల తాకిడి అధికమైంది. నదులు, నాలాలు పొంగిపోర్లుతుండగా..కొండ చరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షాల క్రమంలో జనావాసాల్లోకి వరద నీటితో పాటు పాములు, విష కీటకాలు వస్తుండటంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కాలువలు, డ్రైనేజీలు పొంగి పొర్లడంతో వరద నీటిలో పాములు కొట్టుకవచ్చి జనావాసాల్లోకి చేరుతున్నాయి.
విశాఖ ఆరిలోవ క్రాంతినగర్‌లో ఇంటి ముందు కాలువలో సుమారు 12 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. భారీ కొండచిలువను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాలువలో పొడవైన భారీ కొండ చిలువ కదులుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. కొండచిలువ సంచారం సమాచారాన్ని స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. వారు వచ్చి ఆ కొండ చిలువను పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.
