అమరావతి : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా నలుగురికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోర్టు అనుమతినిస్తూ మిథున్ రెడ్డికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి మిథున్ రెడ్డి ఈనెల 11న సాయంత్రం 5గంటలకు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మిథున్ రెడ్డికి రూ.50 వేల పూచికత్తుతో రెండు ష్యూరిటీలతో మధ్యంతర బెయిల్ లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ 4గా ఉన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 9న జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు వైసీపీ మద్ధతునిస్తుంది. ఎన్డీఏ నుంచి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డిలో బరిలో ఉన్నారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 781 కాగా.. మెజార్టీ మార్కు 391. అధికార పక్షానికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది.
వారికి కూడా బెయిల్ మంజూరు
ఇదే లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి(ఏ31), కృష్ణమోహన్ రెడ్డి ఏ(32), బాలాజీ గోవిందప్ప(ఏ33)లకు కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 14న బాలాజీ గోవిందప్ప, మే 16న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు అరెస్టయ్యారు. ఆ ముగ్గురికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించి. వారి ముగ్గురి పాస్ పోర్టులను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరుతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి సహా ముగ్గురు నిందితులు విడుదలయ్యారు.