Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు ఆక్టోబర్ 8కి వాయిదా

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు బెయిల్‌పై సుప్రీంకోర్టు విచారణ అక్టోబర్ 8కి వాయిదా. దర్యాప్తు సహకారం లేదని వాదనలు.

supreme-court-adjourns-phone-tapping-case-hearing-to-october-8

న్యూఢిల్లీ : తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు లో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావు మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. తదుపరి విచారణ ఆక్టోబర్ 8న చేపడతామని న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న వెల్లడించారు.

కేసులో సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా తమ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ప్రభాకర్‌రావు ఏమాత్రం సహకరించడం లేదని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టాప్‌, కంప్యూటర్ల పాస్‌వర్డ్‌ చెప్పేందుకు ఆయన సహకరించడం లేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడు అధికారులు తమకు ఇచ్చిన అన్ని పరికరాలను యథాతథంగా వెనక్కి ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని.. కానీ వాటిని తుంగలోతొక్కి డేటా మొత్తాన్ని ప్రభాకర్‌రావు డిలీట్‌ చేశారన్నారు. గుర్తు లేదు.. తెలీదు అన్న రీతిలో ప్రభాకర్‌రావు సమాధానం ఇస్తున్నారు తప్ప.. దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని తుషార్‌ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా విచారణకు సహకరించని ప్రభాకర్‌రావు మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని కోరారు. కోర్టు నోటీసులు జారీ చేసిన తర్వాత రాష్ట్రానికి రాకుండా వేరే చోట నుంచి అమెరికా పారిపోయారని గుర్తు చేశారు. ఆయన ఇంట్లో కంప్యూటర్‌ నుంచి ఆధారాలు తొలగించారన్న విషయంపైనా దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పారు. అధికారికంగా ఇచ్చిన ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, మొబైళ్లను ఫ్యాక్టరీ రీసెట్ చేసి ఆధారాలన్నీ చెరిపేసినట్లు ఫొరెన్సిక్ నివేదికలో స్పష్టమైందని కోర్టుకు తెలిపారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతలు, అధికారుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. కానీ వాటన్నింటినీ తొలగించే ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు.

ప్రభాకర్ రావు తరపున సీనియర్‌ న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. విచారణకు ఎప్పుడు పిలిచినా ప్రభాకర్‌రావు వెళ్లారని..ఇప్పటికే ఆయనను 15 సార్లు విచారించారని కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ఆయన్ను వేధిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరినీ పిలిచి ప్రభాకర్‌రావుకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని ఆరోపించారు. మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని శేషాద్రి నాయుడు కోరారు. దీంతో కౌంటర్‌ దాఖలుకు సుప్రీం కోర్టు రెండు వారాల సమయమిస్తూ విచారణను రెండువారాల పాటు వాయిదా వేసింది.