Site icon vidhaatha

ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల నివేదిక

సుప్రీంకు వైద్య పరీక్షల నివేదిక
సీల్డ్‌కవర్‌లో పంపిన తెలంగాణ హైకోర్టు
సర్వోన్నత న్యాయస్థానం చెప్పేవరకూ ఇక్కడే చికిత్స

విధాత,హైదరాబాద్‌ : నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై సికింద్రాబాద్‌లోని సైనిక ఆసుపత్రిలో నిర్వహించిన వైద్యపరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు పంపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు మంగళవారం ముగ్గురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. వైద్య పరీక్షలను అధికారులు వీడియో తీయించి సీల్డ్‌ కవర్‌లో భద్రపరిచారు.

పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్‌ రిజిస్ట్రార్‌ డి.నాగార్జున్‌ నియమితులయ్యారు. వైద్యాధికారుల నివేదికను జ్యుడీషియల్‌ రిజిస్ట్రార్‌ హైకోర్టుకు అందజేశారు. డాక్టర్ల నివేదికతోపాటు.. వీడియో ఫుటేజిని సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు మంగళవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు పంపింది. ఎంపీ కుమారుడు భరత్‌ దాఖలుచేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఎంపీకి రక్త, చర్మ, ఇతర పరీక్షలు నిర్వహించారు.

బయటి నుంచి చర్మవ్యాధి నిపుణుడిని రప్పించి పరీక్షించినట్లు తెలిసింది. నివేదికను సుప్రీంకోర్టు శుక్రవారం పరిశీలించనుంది. వైద్యపరీక్షల నిర్వహణ నుంచి నివేదిక పంపడం వరకూ రహస్యంగానే కొనసాగింది. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజుకు ఇక్కడే చికిత్స అందిస్తామని సికింద్రాబాద్‌ సైనికాసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. వైద్యపరీక్షలన్నీ కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహించినట్లు తెలిపాయి.
కుమారుడినీ అనుమతించని సైనికాధికారులు
రఘురామకృష్ణరాజును కలిసేందుకు ఆయన తనయుడు భరత్‌ మధ్యాహ్నం సైనికాసుపత్రి రాగా ఆయనను సైనికాధికారులు లోపలికి అనుమతించలేదు. మీడియా సిబ్బందిని ఆసుపత్రికి 500 మీటర్ల దూరంలోనే నిలిపివేశారు.

Exit mobile version