అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి,ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుత్తార్లపల్లిలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హంద్రినీవా ద్వారా కుప్పం ప్రాంతానికి తరలొచ్చిన కృష్ణమ్మకు భువనేశ్వరి పసుపు, కుంకుమ, పూలు, చీర సమర్పించి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా కుప్పంకు హంద్రినీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు తెచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ కుప్పం ప్రజలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. అంతకుముందు భువనేశ్వరి శ్రీ ప్రసన్న చౌడేశ్వరమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భువనేశ్వరి నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా గురువారం జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి భూమిపూజ చేశారు. పరసముద్రం కేజీబీవీ స్కూల్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం సామగుట్టపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘విలువల బడి’ కార్యక్రమంలో పాల్గొన్నార. కడపల్లె వద్ద గల స్వగృహంలో మహిళా నాయకురాళ్లతో సమావేశమయ్యారు. డీఎస్సీలో ఎంపికై కొత్తగా ఉద్యోగాలు పొందిన టీచర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు.
