తొలిసారి సచివాలయానికి పవన్‌ కల్యాణ్‌ … సీఎం చంద్రబాబుతో భేటీ

ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ సచివాలయానికి తొలిసారి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిసారి తన చాంబర్‌కు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు తన సీటు నుంచి లేచి ఎదురెళ్లి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు

  • Publish Date - June 18, 2024 / 06:40 PM IST

అమరావతి రైతుల ఘన స్వాగతం
నేడు మంత్రిగా బాధ్యతల స్వీకరణ

విధాత, హైదరాబాద్ : ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ సచివాలయానికి తొలిసారి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిసారి తన చాంబర్‌కు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు తన సీటు నుంచి లేచి ఎదురెళ్లి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. సీఎం చాంబర్‌లో ఉన్న అధికారిక చిహ్నాన్ని చంద్రబాబుకు చూపించిన పవన్‌ కల్యాణ్‌ మీరు ఈ గుర్తుకు హుందా తనం తెచ్చారని వ్యాఖ్యానించారు. పవన్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారిద్ధరు తాజా రాజకీయాలు, ఈ నెల 21నుంచి జరుగాల్సిన అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక అంశాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్‌ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేశ్‌లు ఉన్నారు. తొలిసారి సచివాలయంకు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌ తొలుత తనకు కేటాయించిన చాంబర్‌ను పరిశీలించారు. మంత్రిగా బుధవారం పవన్‌ కల్యాణ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకుంముందు పవన్‌ కల్యాణ్‌ విజయవాడలోని జలవనరుల శాఖ అతిధి గృహానికి వెళ్లారు. పవన్‌కు అధికారులు స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయితో కలిసి భవనాన్ని పరిశీలించారు. పై అంతస్తున నివాసం, కింద అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పక్కనే సమావేశం మందిరం కూడా ఉండడంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్ అంగీకరించారు. అధికారులకు ఆయన కొన్ని మార్పులు చేశారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ 2017లో ఉద్దానం సమస్యలపై చర్చించేందుకు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును కలిసేందుకు తొలిసారి ఈ సచివాలయానికి రావడం గమనార్హం.

అమరావతి రైతుల ఘన స్వాగతం
సచివాలయానికి చేరుకునే క్రమంలో పవన్‌ కల్యాణ్‌కు అమరావతి రాజధాని రైతులు మంగళవారం ఘనస్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణం చేసిన పవన్‌కల్యాణ్‌ తొలిసారిగా అమరావతికి రావడంతో రైతులు, మహిళలు, కూటమి నాయకులు, శ్రేణులు పూలమాలలతో స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు అడుగడుగునా పూలు చల్లారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరవధిక దీక్షకు సంఘీభావం తెలుపడంతో పాటు టీడీపీ అధికారంలోకి రావాడానికి ముఖ్యభూమిక పోషించిన పవన్‌ కల్యాణ్‌కు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద గజమాలతో సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు ఆయన అభిమానులు వేలాది వాహనాలతో ఊరేగింపు నిర్వహించారు.

Latest News