- రెండుగా చీలిన భూమా సమీప కుటుంబ సభ్యులు
- మాజీ మంత్రి అఖిల ప్రియపై తిరుగుబాటు
- భూమా కుటుంబంతో అఖిల ప్రియకు సంబంధం లేదంటూ ప్రకటన
- భూమా కుటుంబమంటే మేమే.. భూమా కిషోర్ రెడ్డి
- ఆమె చేసిన ఘోరాలు అందరికీ తెలుసు
- మీడియా వేదికగా అఖిలప్రియపై తీవ్ర వ్యాఖ్యలు
- ఎన్నికల వేళ ఆళ్లగడ్డ, నంద్యాల రాజకీయాల్లో ట్విస్ట్
Bhuma Family | విధాత: ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘భూమా’ కుటుంబంలో రాజకీయ అలజడి ప్రకంపనలు సృష్టిస్తోంది. భూమా సమీప కుటుంబ సభ్యులు, బంధువులు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. ఆ కుటుంబంలో కీలక నాయకురాలు భూమా అఖిల ప్రియపై తిరుగుబాటు ప్రకటించినట్లు తెలుస్తోంది. తెరపైకి భూమా కిషోర్ రెడ్డి రావడం.. మీడియా వేదికగా ఉమ్మడి కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వర్గీయ భూమా నాగిరెడ్డి కుటుంబానిది ప్రత్యేక రాజకీయ ప్రస్థానం.
మరోవైపు ఫ్యాక్షన్ కుటుంబంగానూ స్థానికులు చూస్తారు. తెలుగుదేశం, వైసీపీ పార్టీల్లో భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరించారు. వారిద్దరి మరణం తర్వాత కుమార్తె భూమా అఖిల ప్రియ రాజకీయ వారసురాలిగా తెరంగేట్రం చేశారు. ఆమె తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా కుటుంబానికి భారీగా రాజకీయ అనుచరగణం వెన్నంటి ఉంటోంది.
ఈ క్రమంలో రాజకీయ విమర్శలు, వివాదాలు, కేసుల్లో నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా భూమా కుటుంబం చర్చకు వస్తూ ఉంటూంది. తాజాగా భూమా కుటుంబంలో రాజకీయ విభేదాలు భగ్గుమన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భూమా కుటుంబం, సమీప కుటుంబ సభ్యులు, వారి బంధువులు రెండుగా చీలిపోయే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా నంద్యాలలో భూమా సమీప కుటుంబ సభ్యులు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
ఈక్రమంలోనే మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు వ్యతిరేకంగా సమీప భూమా కుటుంబ సభ్యులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. భూమా కుటుంబంతో అఖిల ప్రియకు సంబంధం లేదంటూ తెగేసి చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి మరో అడుగు ముందుకేశారు. మా భూమా కుటుంబం అంతా భూమా కిషోర్ రెడ్డికే మద్దతు ఇస్తుందని ప్రకటించడం మరింత కలకలం రేపింది. అఖిల ప్రియకు మద్దతు ఇచ్చేదే లేదంటూ తెగేసి చెప్పారు. అంతటితో ఆగకుండా అఖిల ప్రియ.. భూమా కుటుంబానికి చెందినామే కాదంటూ మరో బాంబు పేల్చారు.
అఖిల ప్రియ భర్త మద్దూర్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా పేర్కొంటూ.. భూమా కుటుంబానికి సంబంధం లేదంటూ తేల్చేశారు. మరోవైపు భూమా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉండేది నేనే అంటూ భూమా కిషోర్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ప్రజల ముందుకు వెళుతున్నట్లు చెప్పుకొచ్చారు. భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం ఆళ్లగడ్డ భారతీయ జనతా పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. తమకు మద్దూరు అఖిల ప్రియ, భార్గవ్ రామ్ నాయుడుతో సంబంధం లేదని ఆయన తేల్చేశారు.
భూమా కుటుంబమంటే మేమే.. మద్దూరు అఖిల ప్రియ కాదంటూ భగ్గుమన్నారు. ఆమె చేసిన ఘోరాలు అన్నీఇన్ని కావని, అందుకే ఆమెను మా కుటుంబం పక్కన పెట్టినట్లు భూమా కిషోర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్టు దక్కని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా అయినా భూమా కుటుంబం తరపున రంగంలో ఉంటానని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు భూమా కుటుంబంలో పంచాయితీ తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.