అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా కేసు విచారణలో సిట్ బృందం దూకుడు పెంచింది. టీటీడీ మాజీ అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. తిరుపతిలోని సిట్ కార్యాలయంలో విచారణకు ఆయన హాజరయ్యారు. ధర్మారెడ్డి ఈవోగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కల్తీనెయ్యి సరఫరాలో ధర్మారెడ్డి పాత్రపైన, సంబంధిత అంశాలపైన ఆయనను అధికారులు ప్రశ్నించారు. గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లుగా సమాచారం. ఈ నెల 13వ తేదీన తమ ముందు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని వైవీ సుబ్బారెడ్డిని స్పష్టంగా ఆదేశించారు.
మాజీ సీఎం వైఎస్. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనే శ్రీవారి ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపడంతో, ప్రస్తుత ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. సుబ్బారెడ్డికి నోటీసుల జారీ వ్యవహారం వైసీపీ శ్రేణుల్లో కలవరం రేపింది. వైవీ సుబ్బారెడ్డి వాంగ్మూలం ఈ కేసులో కొనసాగింది. ఈకేసులో ముఖ్యంగా ఆనాటి దేవాదాయశాఖ మంత్రికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కల్తీ నెయ్యి కేసును సీబీఐ డీఐజీ మురళి లాంబా ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. 2019-2024 మధ్య తిరుపతి ఆలయానికి రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి ఇచ్చినట్లు సీబీఐ ఇప్పటికే వెల్లడించింది.
