అమెరికా నాన్ వెజ్ పశువుల దాణాపై సమాజ్ వాది ఎంపీ వ్యాఖ్యల వీడియో వైరల్
విధాత : బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే.. ఆ ఒక్క అంశమే యావత్ దేశాన్ని కుదిపేసేదంటూ ఓ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ భారత పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల వీడియో నెట్టింటా చర్చ రేపుతుంది. భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ పార్లమెంటు లోపల, బయట మాట్లాడారు. అమెరికా నుంచి వచ్చే నాన్ వెజ్ (మాంసాహార) పశువుల దాణా..మన ఆవులను అపవిత్రం చేయవా..వాటి పాలు దేవాలయాలకు, దేవతల నైవేద్యాలకు ఎలా వాడుతారు అని ప్రశ్నించారు.ఇదే ఒప్పందం బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే ఈ ఒక్క అంశం యావత్ దేశాన్నే కుదిపేసే అంశంగా మారిపోయేది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చురకలేశారు.
అమెరికా మాంసాహార పశువుల దాణా భారతీయ ఆవులను అపవిత్రం చేస్తుంది, దేవాలయాలలో పాలు అర్పించడానికి పనికిరావు అని మా పార్టీ నేత అఖిలేష్ యాదవ్ దీనిని రైతులకు ముప్పుగా భావిస్తున్నారని ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. అటువంటి దాణాను తినే ఆవుల నుండి వచ్చే పాల ఉత్పత్తులు సనాతనీయులు (హిందువులు) తమ ఉపవాస పద్ధతులను ఎలా కొనసాగించగలరని,హిందువుల ఆచారాలను, నమ్మకాలకు ఇది విరుద్దమైనవన్నారు. అంతేకాదు భారతీయ వ్యవసాయంపైన, రైతులపైన, పాడి రంగంపైన ఈ ఒప్పందంతో వచ్చే నాన్ వెజ్ పాల దిగుమతి దాడి వంటిదని ఎంపీ రామ్ గోపాల్ స్పష్టం చేశారు.
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంలో దీనిపైనే తీవ్ర వ్యతిరేకత
భారత్- అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి అమెరికా డెయిరీ ఉత్పత్తులు, ముఖ్యంగా ” నాన్-వెజ్ మిల్క్ “దిగుమతి అంశం ప్రధానంగా నిలిచింది. అమెరికా డెయిరీ ఉత్పత్తులు, ప్రధానంగా నాన్-వెజ్ మిల్క్‌ను భారత ప్రభుత్వం,రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా నాన్ వెజ్ మిల్క్, జంతు ఆధారిత దాణా తీసుకునే ఆవుల పాలతో రూపొందించే మిల్క్ ప్రోడక్ట్స్ భారతీయుల, ప్రధానంగా హిందువుల సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీస్తుందన్న వ్యతిరేకత వ్యక్తమైంది.
భారత్ లో నాన్ వెజ్ పశు దాణా నిషేధం
భారతదేశ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ ఆహార దిగుమతుల విషయంలో వెటర్నరీ సర్టిఫికేషన్ లో కూడా నాన్ వెజ్ పశుదాణాను నిషేధించారు. పాలను ఇచ్చే జంతువులకు మాంసం లేదా అంతర్గత అవయవాలు, రక్తం, రుమినెంట్ మూలం యొక్క కణజాలాలు , పంది మాంసం మూల పదార్థాలతో సహా మాంసం లేదా ఎముక భోజనం నుండి ఉత్పత్తి చేయబడిన దాణాను భారత్ లోని పశువులకు ఇవ్వకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే అందుకు భిన్నంగా అమెరికాలోని పశువులకు జంతువుల మాంసం, ఇతర జంతు ఉత్పత్తులను దాణాగా ఇస్తారు. పంది, చేప, కోడి, గుర్రం, పిల్లి, కుక్క యొక్క శరీర భాగాలతో కూడిన పశు దాణాను అక్కడ వినియోగిస్తున్నారు. అందుకే భారత్ నుంచి అమెరికా మిల్క్ ప్రోడక్ట్ లపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
“Non-veg cattle feed from US will make Indian cows unholy, milk unsuitable for offering at temples.”
– SP MP Ram Gopal Yadav on India-US trade deal pic.twitter.com/0dEEhWzhGW
— News Arena India (@NewsArenaIndia) February 13, 2026
