Rahul Gandhi | ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు భయపడే.. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌.. మోదీకి దమ్ముంటే దాన్ని రద్దు చేయాలి : రాహుల్‌ గాంధీ

వాణిజ్య ఒప్పందం పేరుతో భారతదేశ రైతాంగాన్ని, దేశ వస్త్రపరిశ్రమను ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు అమ్మేశారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

  • By: TAAZ |    national |    Published on : Feb 24, 2026 7:17 PM IST
Rahul Gandhi | ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు భయపడే.. అమెరికాతో ట్రేడ్‌ డీల్‌..  మోదీకి దమ్ముంటే దాన్ని రద్దు చేయాలి : రాహుల్‌ గాంధీ

Rahul Gandhi | భారత రైతుల ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సవాలు చేశారు. భోపాల్‌లో మంగళవారం రైతుల ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ ఒప్పందం భారత రైతుల గుండెలను చీల్చే బాణం లాంటిదని అభివర్ణించారు. ‘ట్రేడ్ డీల్స్‌పై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దానిని రద్దు చేయాలని నేను మోదీని డిమాండ్‌ చేస్తున్నా.. కానీ.. ఆయన అలా చేయలేరు..’ అని రాహుల్‌ అన్నారు. ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌లు చెల్లుబాటు కావని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన రాహుల్‌ గాంధీ… తన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, పారిశ్రామికవేత్త గౌతం అదానీ ప్రయోజనాలు కాపాడేందుకే మోదీ అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి హడావుడిపడ్డారని అన్నారు. ‘ప్రధానిని భయపెట్టేందుకే హర్దీప్‌సింగ్‌ పురి పేరు ఉన్న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదల చేశారు. అమెరికా ప్రభుత్వం వద్ద ఇంకా విడుదల చేయని లక్షల కొద్దీ వీడియోలు, మెసేజ్‌లు ఉన్నాయి’ అని రాహుల్‌ చెప్పారు. ఇక అదానీ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలో అదానీపై కేసు నమోదు కాలేదని, అది నరేంద్రమోదీపై నమోదైన కేసు అని అన్నారు. ఈ రెండు కారణాల వల్లే మోదీ పార్లమెంటుకు రాకుండా అమెరికాతో వాణిజ్యం ఒప్పందాన్ని కుదుర్చుకున్నరని ఆరోపించారు. అనిల్‌ అంబానీతో సంబంధాలేంటన్న విషయాన్ని మోదీ బయటపెట్టాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. తాను ఆర్మీ మాజీ చీఫ్‌ నరవణే పుస్తకం విషయంలో మోదీని ప్రశ్నించిన రోజే ఆయన అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అన్నారు. ‘భారతదేశ రైతాంగాన్ని, వస్త్ర పరిశ్రమను, డాటాను ప్రధాని మోదీ అమ్మేశారు’ అని రాహుల్‌ పునరుద్ఘాటించారు.

‘నేను మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి. చాలా జాగ్రత్తగా వినండి.. పార్లమెంటులో నా ఉపన్యాసం ముగియగానే.. ప్రధాన మంత్రి పార్లమెంటును వదిలి వెళ్లిపోయారు. సాయంత్రం రాజ్‌నాథ్‌ సింగ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, గడ్కరీ.. నిజానికి మొత్తం క్యాబినెట్‌నే సంప్రదించకుండా.. ట్రంప్‌కు మోదీ ఫోన్‌ చేశారు. అనంతరం ట్రంప్‌ ఒక ట్వీట్‌ చేస్తూ.. మోదీ తనకు ఫోన్‌ చేశారని, అమెరికా–భారత్‌ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారని అందులో పేర్కొన్నారు. నాలుగు నెలలుగా ఏమీ అవలేదు. కానీ.. అకస్మాత్తుగా ట్రంప్‌నకు మోదీ ఫోన్‌ చేసి, భారత రైతులను అమ్మేశారు.. భారత వస్త్ర పరిశ్రమను అమ్మేశారు.. మన డాటా మొత్తాన్ని అమెరికాకు అప్పగించేశారు’ అని రాహుల్‌ చెప్పారు.