పెట్రోల్‌ ధరల పెంపు నేపథ్యంలో పొదుపు డ్రామా? కాన్వాయ్ తగ్గించిన మోదీ.. ఆటో, మెట్రో, బైక్‌లపై బీజేపీ నేతల ప్రచారం

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారు. విశేషం ఏమిటేంటే మోదీ సహా బీజేపీ నాయకులు, ముఖ్యమంత్రులు ఎవ్వరూ దాని గురించి మాట్లాడటం లేదు.. పైగా పొదుపు చర్యలను ఊదరగొడుతున్నారు. తాము మెట్రోలో తిరిగామని, బైక్‌పై వెళ్లామని ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. ఇది చిత్తశుద్ధితో చేసిందా? లేక ప్రచారపటాటోపమా? లేక జనం దృష్టి మళ్లించేందుకా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పెట్రోల్‌ ధరల పెంపు నేపథ్యంలో పొదుపు డ్రామా? కాన్వాయ్ తగ్గించిన మోదీ.. ఆటో, మెట్రో, బైక్‌లపై బీజేపీ నేతల ప్రచారం
  • పొదుపు పేరుతో పోటాపోటీ ప్రచారాలు
  • సోషల్ మీడియాలో హోరెత్తుతున్న ఫొటోలు, వీడియోలు

అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయనే కారణం చూపుతూ తమ కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకునే పనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. తన వాహన శ్రేణిలో పదుల కొద్దీ వాహనాలను రెండుకు కుదించి ప్రయాణం చేస్తున్నారు. పొదుపు చర్యల్లో భాంగంగా రెండింటినే వాడుతున్నట్లు ప్రచార, ప్రసార మాధ్యమాలకు ఫొటోలు విడుదల చేశారు. ఇంకేముంది కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ఎన్డీఏ సీఎంలు పోటాపోటీగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ బికనీర్‌లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటోలో తిరుగుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే టూ వీలర్‌పై హెల్మెట్ పెట్టుకుని అధికారిక బంగ్లా నుంచి సచివాలయం వెళ్లారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే సైకిల్‌పై వెళ్లారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మెట్రో రైలులో ఫైళ్లు చూస్తున్నట్లు ఫొటోలు వచ్చాయి. వీళ్లు ఇలా తిరుగుతుంటే కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పటిలాగే సర్కార్ వాహనాల్లో దర్జాగా భద్రతా సిబ్బందితో పర్యటనలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రచారం పిచ్చి తప్ప కొద్ది రోజుల తరువాత మళ్లీ ఎప్పటిలాగే భారీ వాహనాల కాన్వయ్, సైరన్లు మోగించుకుంటూ వెళ్తారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

మోదీ కాన్వాయ్‌లో రెండేవాహనాలట

ప్రధాన మంత్రి మోదీ కాన్వాయ్‌లో మొత్తం పదిహేను వాహనాల వరకు ఉండేవి. వీటిలోనూ మూడు నాలుగు వరకు అత్యంత ఖరీదైన బుల్లెట్ ఫ్రూఫ్‌ వాహనాలు. ఆయుధాలు ఉన్న కార్లు, ఎస్‌యూవీ ఎస్కార్టు, సెక్యురిటీ జామర్, అంబులెన్స్ వంటివి ఉండగా, వీటన్నింటినీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) నియంత్రిస్తుంది. మధ్య ఆసియా దేశాల్లో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో వినియోగించే ఇంధనాల్లో 95 శాతం మధ్య ఆసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. క్రూడాయిల్ ధరలు పెరగడంతో దేశంపై భారం పెరుగుతోంది. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు ప్రధాని పొదుపు మంత్రి పాటించాలని పిలుపునిచ్చారు. మోదీ తీసుకున్న నిర్ణయానికి భద్రతాధికారుల ఆమోదం ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దేశ ప్రధానికి వివిధ విచ్చిన్నకర శక్తులు, ఉగ్రవాద సంస్థలు, సంఘ వ్యతిరేకులు, తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నది. గతంలో ఏ ప్రధానికి లేని విధంగా మోదీకి భద్రత కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాల సంఖ్య తగ్గించడం మూలంగా ఏదైనా జరగరాని దుర్ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనేది స్పష్టం చేయాల్సిన బాధ్యత భద్రతా వర్గాలు, కేంద్ర ప్రభుత్వం పై ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన కాన్వాయ్ తగ్గించుకోవడం మూలంగా ఒరిగే ప్రయోజనం లేదని, దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మోదీపై ఉందంటున్నారు. వీటన్నిటి జోలికి వెళ్లకుండా ప్రచార, ప్రసార సాధానాల్లో ప్రచారం చేసుకునేందుకు ఫొటోలు విడుదల చేయడం మూలంగా జటిలంగా ఉన్న సమస్య పరిష్కారం కాదంటున్నారు.

గతంలో మోదీ పర్యటనలో భద్రతా లోపాలు

భద్రతా లోపాల కారణంగా ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయి. 2022 జనవరిలో పంజాబ్ పర్యటనలో రాష్ట్ర సరిహద్దు ఫిరోజ్ పూర్ లో నిరసనకారులు అడ్డుకోవడంతో ప్రధాని కాన్వాయ్ ఒక బ్రిడ్జీపై ఇరవై నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎస్పీజీ భద్రత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం, నిఘా వైఫల్యం మూలంగా ఈ ఘటన జరిగింది. రైతుల నల్ల చట్టాలపై పంజాబ్, హర్యానా లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. దీన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రమైన భద్రతా లోపంగా ప్రకటించింది. విచారణ తరువాత ఈ ఘటనకు బాధ్యులుగా ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. తాజాగా బెంగళూరులో ఆయన పర్యటించే మార్గంలో (ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంగణం సమీపంలో) జిలెటిన్ స్టక్స్, టైమర్, సర్క్యూట్ ను నిఘాల వర్గాలు రెండు గంటల ముందే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతోందని కర్నాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి కూడా. పెట్రోల్ పొదుపులో భాగంగా రాష్ట్రాలలో పర్యటించిన సందర్భంలో రెండు వాహనాలతోనే ప్రయాణిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ప్రముఖుల పర్యటనలు సజావుగా, ఏలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు పోలీసులు బ్లూ బుక్ ప్రొటోకాల్ అమలు పరుస్తారు. ఇక నుంచి బ్లూ బుక్ అమలు చేస్తారా లేదా సాధారణ పౌరుడిగానే పరిగణిస్తారా అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించాల్సి ఉంది.

గుడ్డిగా మోదీ బాట పట్టిన సీఎం లు, కేంద్ర మంత్రులు

ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపు చర్యలను పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు గుడ్డిగా పాటిస్తున్నారు. ముందూ వెనకా ఆలోచించకుండా అప్పుడే చర్యలు మొదలు పెట్టారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు మెట్రో రైలులో ప్రయాణించినట్లుగా ఉందని విమర్శలు మొదలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కూడా తన కాన్వాయ్ లో వాహనాల సంఖ్య 50 శాతం తగ్గించారు. 12 వాహనాల నుంచి నాలుగు వాహనాలకు తగ్గించారు. పైలెట్, ఎస్కార్ట్ లేకుండా కేవలం నాలుగు వాహనాలతో పర్యటనలు చేస్తున్నారు. ఇదే బాటలో బిహార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు. సీఎం సామ్రాట్ చౌదరి కాన్వాయ్ పరిమాణం తగ్గించారు. బుల్లెట్ పై దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీకి బయలుదేరారు. బుల్లెట్ పై అసెంబ్లీకి బయలు దేరిన ఫడ్నవిస్, వారానికి ఒక రోజు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ఉపయోగించాలని ఉచిత సలహా ఇచ్చారు. హెలీకాప్టర్ వాడవద్దని, కాన్వాయ్ ను సగం కుదించాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కవీందర్ గుప్తా నిర్ణయించారు. పొదుపు చర్యలు పాటించాలని సీఎం సుఖ్వీందర్ ను కోరగా, మంత్రుల వేతనాలు 30 శాతం, ఎమ్మెల్యేల వేతనాలు 20 శాతం తగ్గించినట్లు ఆయన ప్రకటించారు. చత్తీస్ గఢ్, ఒడిశా ముఖ్యమంత్రులు, మంత్రులు తమ వాహన శ్రేణిలో సగం పైగా తగ్గించుకున్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్ లో వాహనాల సంఖ్య 13 నుంచి 8కి తగ్గించుకున్నారు.

ప్రచార పటాటోపమా?

ఇదే దారిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాహన శ్రేణిని తగ్గించుకోవడమే కాకుండా గురువారం నాడు మహారాష్ట్ర లోని పూణే నగరంలో బస్సులో ప్రయాణించి హైవే నిర్మాణ పనులు పరిశీలించారు. మరో మంత్రి శివరాజ్ చౌహాన్ తన కాన్వాయ్ లో మూడే వాహనాలు ఉండాలని, తన శాఖ పరిధిలో ఇంటి నుంచే పని విధానంపై త్వరలో ప్రకటన చేస్తానన్నారు. అనవసర బంగారం కొనుగోలు వద్దని ఆయన సిబ్బందికి సూచిస్తూ, ప్రతి ఐదుగురికి ఈ విషయం చెప్పాలన్నారు. రాజస్థాన్ లోని బికనేర్ కు వెళ్లిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ స్థానికంగా ఎలక్ట్రిక్ ఆటోలో ప్రయాణించారు. ఈ ఫొటోల ప్రచారపటాటోపం నిలబడేదేనా.. లేక ప్రజలు ఏదైనా త్వరగా మర్చిపోతారనే ధీమాతోనా? అన్నది రానున్న రోజుల్లోనే తేలాలి.

ఇవి కూడా చదవండి.. 

Petrol | ఇండియాలో పెట్రోల్ ఎక్కువగా వాడుతున్న రాష్ట్రం ఇదే!
పొదుపు చర్యలు ప్రారంభించిన సుప్రీంకోర్టు
ఏటీఎంలు ఖాళీ? బ్యాంకుల‌ను వేధిస్తున్న‌న‌గ‌దు కొర‌త‌.. గ్రామీణ రైతుల అవస్థలు
Divorce | నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ‌