Akhilesh Yadav | మాట్లాడింది రెండే నిమిషాలు.. కానీ.. స్పీకర్‌కు చురకలేసిన అఖిలేశ్‌యాదవ్‌

గత లోక్‌సభలో జరిగినట్టుగా ఈ లోక్‌సభలో సస్పెన్షన్లు, బహిష్కరణలు వంటి ఉండబోవని ఆశిస్తున్నానంటూ స్పీకర్‌ ఓం బిర్లానుద్దేశించి సమాజ్‌వాది పార్టీ ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ పరోక్ష చురకలు అంటించారు

Akhilesh Yadav | మాట్లాడింది రెండే నిమిషాలు.. కానీ.. స్పీకర్‌కు చురకలేసిన అఖిలేశ్‌యాదవ్‌

న్యూఢిల్లీ: గత లోక్‌సభలో జరిగినట్టుగా ఈ లోక్‌సభలో సస్పెన్షన్లు, బహిష్కరణలు వంటి ఉండబోవని ఆశిస్తున్నానంటూ స్పీకర్‌ ఓం బిర్లానుద్దేశించి సమాజ్‌వాది పార్టీ ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ పరోక్ష చురకలు అంటించారు. మాట్లాడింది రెండు నిమిషాలే అయినా.. వ్యంగ్యోక్తులు, స్పీకర్‌కు పరోక్ష సందేశాలతో అఖిలేశ్‌ ప్రసంగం సాగింది. గత సభలో యావత్‌ ప్రతిపక్ష సభ్యులను ఓం బిర్లా సస్పెండ్‌ చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను అభినందిస్తూ మాట్లాడిన అఖిలేశ్‌యాదవ్‌.. ఎంపీల సస్పెన్షన్‌ వంటి చర్యలు సభ గౌరవానికి భంగం కలిగిస్తాయని చెప్పారు. ‘ఏ ప్రజాప్రతినిధి గొంతునూ అణచివేయబోరని, బహిష్కరణల వంటి చర్యలు మరోసారి ఉండబోవని మేం ఆశిస్తున్నాం. ప్రతిపక్షంపై మీ నియంత్రణ ఉన్నది. కానీ.. అధికారపక్షంపైనా అది ఉండాలి’ అని అఖిలేశ్‌ అన్నారు. గత శీతాకాల సమావేశంలో పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. నైతిక దుష్ప్రవర్తన పేరుతో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రిని సైతం బహిష్కరించారు.

ప్రతిపక్షం పట్ల స్పీకర్‌ నిష్పాక్షికంగా వ్యవహరించాలని అఖిలేశ్‌యాదవ్‌ కోరారు. ‘ఈ గొప్ప పదవికి ఉన్న గొప్ప బాధ్యత నిష్పాక్షికత’ అని నొక్కి చెప్పారు. ఈ సభ మీరిచ్చే సంకేతాల ఆధారంగా పనిచేయాలే కానీ.. వేరొక పద్ధతిలో కాదని అన్నారు. ‘మీ నిర్ణయాలన్నింటినీ అంగీకరిస్తాం. అధికారపక్షానికి మీరు ఎంత గౌరవం ఇస్తారో ప్రతిపక్షానికి కూడా అంతే గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ప్రజాస్వామ్య కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా మీరు ఇక్కడ కూర్చున్నారు’ అని అన్నారు. 8 రోజులపాలు కొనసాగే 18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రధాని నరేంద్రమోదీ సహా సభ్యులంతా ప్రమాణాలు చేశారు. మంగళవారం అఖిలేశ్‌యాదవ్‌, రాహుల్‌గాంధీ మొదటి వరుసలో కూర్చొని ఉండటం కనిపించింది. గత సమావేశాల్లో రాహుల్‌ రెండో వరుసలో కూర్చొన్నారు.