స్పీకర్‌ పదవికి ఇండియా కూటమి నుంచి బరిలో కే సురేశ్‌

సంప్రదాయాన్ని పాటించి ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చేందుకు బీజేపీ తిరస్కరించడంతో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్‌ ఎంపీ కే సురేశ్‌ బరిలో నిలిచారు. మరోవైపు మాజీ స్పీకర్‌, కోటా నుంచి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా స్పీకర్‌ పోస్టుకోసం మంగళవారం తన నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

స్పీకర్‌ పదవికి ఇండియా కూటమి నుంచి బరిలో కే సురేశ్‌

న్యూఢిల్లీ : సంప్రదాయాన్ని పాటించి ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చేందుకు బీజేపీ తిరస్కరించడంతో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్‌ ఎంపీ కే సురేశ్‌ బరిలో నిలిచారు. మరోవైపు మాజీ స్పీకర్‌, కోటా నుంచి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా స్పీకర్‌ పోస్టుకోసం మంగళవారం తన నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. దీంతో 1946 తర్వాత తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక జరిగే పరిస్థితి నెలకొన్నది. అధికార పక్షానికి సంఖ్యాబలం అధికంగా ఉన్న నేపథ్యంలో ఓం బిర్లా ఎన్నిక లాంఛనమే. అయినప్పటికీ.. ప్రతిపక్ష బలం కూడా స్పష్టంకానున్నది. వాస్తవానికి స్పీకర్‌ను ఏక్రగీవంగా ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. అదే సమయంలో ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవిని అధికార పక్షాలు కేటాయించేవి. అయితే.. అసలు డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే గత సభ నడిచింది. ఈ సభలో తమకు డిప్యటీ స్పీకర్‌ పదవిని కేటాయించాలని ప్రతిపక్షాలు కోరినా బీజేపీ సిద్ధపడలేదు. దీంతో కే సురేశ్‌ను బరిలో నిలుపుతున్నట్టు ఇండియా కూటమి ప్రకటించింది.

స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సంప్రదించారు. తమకు డిప్యూటీ స్పీకర్‌ పోస్టు ఇచ్చేట్టయితే ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో మోదీని అడిగి చెబుతాని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. అటు నుంచి జవాబు లేకపోవడంతో స్పీకర్‌ ఎన్నిక అనివార్యం కానున్నది.

ఖర్గేతో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడిన విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ధృవీకరించారు. సంప్రదాయాన్ని పాటించి డిప్యూటీ స్పీకర్‌ పోస్టును తమకు కేటాయిస్తే ఓం బిర్లా ఎన్నికకు సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సహకరించాలని ప్రధాని మోదీ ప్రతిపక్షాలను కోరినట్టు ఈ రోజు వార్తలు వచ్చాయి. మల్లికార్జున ఖర్గేను రాజ్‌నాథ్‌ సింగ్‌ సంప్రదించి, మద్దతు కోరారు. స్పీకర్‌కు మద్దతు ఇచ్చేందుకు యావత్‌ ప్రతిపక్షం అంగీకరించింది. కానీ.. సంప్రదాయాన్ని పాటించి డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలి. మళ్లీ కాల్‌ చేస్తానని ఖర్గేకు రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పటి వరకూ ఫోన్‌ రాలేదు. ప్రతిపక్షం నుంచి సహకారాన్ని మోదీ కోరుతున్నారు. కానీ.. మా నేతను గౌరవించలేదు’ అని రాహుల్‌గాంధీ మీడియాతో అన్నారు. ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్యపక్షం సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ కూడా డిప్యూటీ స్పీకర్‌ పోస్టును ప్రతిపక్షానికి కేటాయించాలన్న వైఖరిని పునరుద్ఘాటించారు.