Skull broken | అల్లరి చేస్తోందని పాప పుర్రె పగులగొట్టిన టీచర్​

చిత్తూరు జిల్లా పుంగనూరులో అల్లరి చేస్తోందని ఒక బాలిక తలపై స్కూల్ బ్యాగ్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు.. తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రికి వెళితే షాకింగ్ రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు

  • Publish Date - September 17, 2025 / 11:32 PM IST

Skull broken | ఓ ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. అల్లరి చేస్తోందని బాలిక తలపై బరువైన స్కూల్ బ్యాగ్‌తో కొట్టడంతో ఆమె పుర్రె ఎముక చిట్లిపోయింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలనొప్పితో మూడు రోజులు బాధపడిన బాలికను బెంగళూరులో వైద్యులకు చూపించగా అసలు విషయం బయటపడింది.

పుంగనూరులో ఉపాధ్యాయుడి దారుణం

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన హరి, విజేతల కుమార్తె సాత్విక నాగశ్రీ (11) స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. సెప్టెంబర్ 10వ తేదీన తరగతి గదిలో అల్లరి చేస్తోందని హిందీ ఉపాధ్యాయుడు పట్టరాని కోపంతో స్కూల్ బ్యాగ్‌తో బాలిక తలపై బలంగా కొట్టాడు. తల్లిదండ్రులలో తల్లి విజేత అదే స్కూల్లో పని చేస్తున్నా, పిల్లలను కొట్టడం మామూలే  అన్న భావనతో పెద్దగా పట్టించుకోలేదు.

అయితే దెబ్బతిన్న తర్వాత బాలికకు తలనొప్పి తీవ్రమవుతూ వచ్చింది. విపరీతంగా ఏడుస్తూ, మూడు రోజులపాటు స్కూల్‌కు వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను పుంగనూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లాల్సిందిగా సూచించారు.

వైద్యుల షాకింగ్ రిపోర్ట్

Chittoor Punganur teacher beats student with school bag, skull bone fractured

బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేసి, సాత్విక పుర్రె ఎముక చిట్లిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఇదే తలనొప్పికి ప్రధాన కారణమని తెలిపారు. హుటాహుటిన అమ్మాయికి శస్త్రచికిత్స చేసి కపాలాన్ని సరిచేసారు. బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, తీవ్రమైన నొప్పి ఇంకా వేధిస్తోందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తమ కూతురును ఇలా బాదిన టీచర్​ను, స్కూల్ యాజమాన్యాన్ని శిక్షించాలని బాలిక తల్లి విజేత, బంధువులు ఆ ఉపాధ్యాయుడు, స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులను కొట్టి శిక్షించడం అనాగరికమని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.