YS Sharmila : మోదీ జీఎస్టీ 2.O ఉత్సవ్ ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్

ప్రధాని మోదీ 'జీఎస్టీ 2.O ఉత్సవ్' ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల విమర్శించారు. స్వల్ప తగ్గింపుతో ప్రయోజనం లేదన్నారు. ఏపీ అభివృద్ధికి కావాల్సింది జీఎస్టీ ఉత్సవాలు కాదు, 'ప్రత్యేక హోదా' మాత్రమేనని ఆమె డిమాండ్ చేశారు.

Modi Vs Sharmila

అమరావతి : ప్రధాని మోదీ జీఎస్టీ 2.O ఉత్సవ్ ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల విమర్శించారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్(జీఎస్టీ) పేరుతో 2017-18 నుంచి 2024-25 మధ్య 8 ఏళ్లలో దోపిడీ చేసింది రూ.55,44,897 కోట్లు అని..ఇప్పుడు 2.O సంస్కరణల పేరుతో తగ్గించింది రూ.2.5 లక్షల కోట్లు మాత్రమేనని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఇన్నాళ్లు ఎడాపెడ పన్నుల మోత మోగించి, సామాన్యుల నడ్డి విరిచిన ప్రధాని మోదీ.. గోరంత ట్యాక్సులు తగ్గించి కొండంత చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందనేది పచ్చి అబద్ధం అని, ఆత్మనిర్భరత,నవశకం, నవతరం అనేది అంతా బూటకం. ఉత్సవాల పేరిట సభలు నిర్వహించడం హాస్యాస్పదం అన్నారు. రేపటి కర్నూల్ సభకు 7వేల బస్సులను పంపిస్తున్నారని, 5 లక్షల మంది జనసమీకరణ చేస్తామంటున్నారని.. ప్రజల సొమ్ముతో మోదీ సొంత భజన చేయడానికి కూటమి పార్టీలకు, ప్రభుత్వానికి సిగ్గుండాలని షర్మిల విమర్శించారు.

ఏపీ అభివృద్దికి ప్రత్యేక హోదానే సంజీవని

స్వల్పకాలిక జీఎస్టీ పన్నుల సవరణతో ఏపీ ప్రజలకి తగ్గిన ట్యాక్సుల భారం రూ.8వేల కోట్లు మాత్రమేనని… ఇది ఎంతమాత్రం ప్రజలకు ఉపశమనం కాదు అని షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు న్యాయం జరగాలంటే కావాల్సింది జీఎస్టీ ఉత్సవాలు కాదు.. “ప్రత్యేక హోదా” మాత్రమేనన్నారు. హోదానే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని. హోదాతోనే పరిశ్రమలు, భారీగా పన్ను రాయితీలు, నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు. 2014లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా అమలైవుంటే నేడు దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేదన్నారు.

రేపు కర్నూల్ జిల్లాలో జీఎస్టీ 2.0 ఉత్సవ సభకు వస్తున్న ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నామని, తిరుపతి వేదికగా ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పారని షర్మిల గుర్తు చేశారు.. రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి హోదా అంశాన్ని దాటేస్తున్నారు. విభజన హామీలపై సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఈసారైనా ప్రత్యేక హోదా ప్రకటన చేయాలి. లేకుంటే హోదాపై బీజేపీ వైఖరి ఏంటో తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు.