Beauty tips | చర్మంపై బ్లాక్‌ హెడ్స్ వేధిస్తున్నాయా.. ఈ చిట్కాలతో వెంటనే చెక్‌ పెట్టేయండి..

  • Publish Date - April 9, 2024 / 08:54 AM IST

Beauty tips : చాలామందిని వేధిస్తున్న చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్ సమస్య ఒకటి. బ్లాక్ హెడ్స్‌ అంటే చర్మంపై చిన్నసైజులో వచ్చే నల్లనల్లని కురుపుల్లాంటి మచ్చలు. ఇవి తొలగించినాకొద్ది పదేపదే వస్తుంటాయి. మృతకణాలు చర్మ రంధ్రాలను పూడ్చేయడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది. ముఖం, భుజాలు, బాహువులపై ముఖంలో ముఖ్యంగా ముక్కుపై, గదమపై ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. బ్లాక్‌ హెడ్స్‌ను పోగొట్టే ఆ చిట్కాలు కొన్ని ఇప్పుడు చూద్దాం.

చిట్కాలు..

నీటి ఆవిరి

ఒక పాత్రలో నీళ్లను తీసుకుని వేడి చేయాలి. ఆ తర్వాత నీటి ద్వారా వచ్చే అవిరిపై టవల్‌ను పెట్టాలి. వెంటనే ఆ టవల్‌ను బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉన్న చోట సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే కొన్ని రోజుల్లోనే బ్లాక్‌ హెడ్స్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది.

పెరుగు, శనగపిండి, కాఫీ పొడి

చిక్కటి పెరుగు, శనగపిండి, కాఫీపొడి కలిపి పేస్ట్‌లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై అప్లయ్‌ చేసి చేతులతో తేలికగా మసాజ్ చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలపాటు మసాజ్ చేసి ఆ తర్వాత సాధారణ నీళ్లతో కడుక్కోవాలి. అనంతరం మాయిశ్చరైజర్ అప్లయ్‌ చేయడం మర్చిపోవద్దు. వారానికి రెండు సార్లు ఇలా మసాజ్ చేయడంవల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

గుడ్డు తెల్లసొన, బేకింగ్ సోడా

గుడ్డులోని తెల్లసొనలో రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా మిక్స్ చేసి బ్లాక్‌ హెడ్స్‌పై అప్లయ్‌ చేయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాలు చేతులతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేసుకోవచ్చు. దీంతో నల్లమచ్చలు త్వరగా తగ్గిపోతాయి.

పుదీనా ఆకుల పేస్ట్‌

పుదీనా ఆకుల పేస్టును ఉపయోగించడం ద్వారా సులభంగా బ్లాక్ హెడ్స్‌ను దూరం చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా పుదీనా ఆకులు, చిటికెడు పసుపును నీటిలో వేసి మరిగించాలి. ఆకులను మెత్తగా చేసి బ్లాక్‌ హెడ్స్‌పై పట్టించి కాసేపు అలాగే వదిలేయాలి. అనంతరం చేతులతో సుతిమెత్తగా మసాజ్ చేయాలి. ఇప్పుడు గోరువెచ్చని లేదా సాధారణ నీటితో కడుక్కోవాలి.

గమనిక : పై వాటిలో మీకు నచ్చిన చిట్కాను పాటించి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఏకకాలంలో అన్ని చిట్కాలను ప్రయత్నించకుండా ఒక చిట్కా పనిచేయకపోతే తర్వాత మరో చిట్కాకు మారండి.

Latest News