Site icon vidhaatha

21 నాటికి జైలుకు పోవాల్సిందే: సుప్రీంకోర్టు ఆదేశం

21 నాటికి జైలుకు పోవాల్సిందే జైలుకు పోకుండా మరికొన్ని రోజులు ఉండాలని భావించిన బిల్కిస్‌బానో రేపిస్టులకు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ కేసులో 11 మంది దోషులు కోర్టు గతంలో ఆదేశించిన మేరకు జనవరి 21 నాటికి జైలుకు తిరిగి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు వారు పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించింది. దోషులు తమ పిటిషన్లలో పేర్కొన్న కారణాల్లో యోగ్యత లేదని కోర్టు స్పష్టం చేసిందని లైవ్‌లా పేర్కొన్నది. ‘జైలుకు సరెండర్‌ అయ్యేందుకు మరింత సమయంలో కోరుతూ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌లో చూపిన కారణాల్లో ఎలాంటి యోగ్యత లేదు. వారు చూపిన కారణాలు మేము ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు ఏ విధంగానూ అడ్డంకి కాదు’ అని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.


తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయేందుకు వేర్వేరు కారణాలు చూపుతూ పలువురు దోషులు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు కుటుంబ బాధ్యతలను, కొడుకు పెళ్లి, పంటల కోతలు తదితర కారణాలు చూపుతూ గడువు కోరారు.


2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌బానోపై గ్యాంగ్‌ రేప్‌, ఆమె కుటుంబంలోని ఏడుగురి హత్య కేసులో జీవిత శిక్ష అనుభవిస్తున్న 11 మందిని విడుదల చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను జనవరి 8వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version