BJP | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఎమ్మెల్యే ఆశావాహులు ఆయా పార్టీల నుంచి టికెట్లు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కుటుంబ సభ్యుల మధ్యనే తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. దాడులకు వెనుకాడటం లేదు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఓ మహిళ తన సోదరుడిపై చెప్పుతో దాడి చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. అల్వార్ రూరల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే జయరాం జాతవ్, ఆయన కుమార్తె మీనా కుమారి ఆసక్తి చూపుతున్నారు. అయితే టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య నెలకొన్న పోటీని నియోజకవర్గ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఈ టికెట్ల పంచాయితీ జైపూర్‌లోని బీజేపీ ఆఫీసుకు చేరింది.
బీజేపీ ఆఫీసు బయట మీనా కుమారి మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమిగూడి ఆమెకు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే జయరాంకే బీజేపీ టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడే ఉన్న తన సోదరుడిపై మీనా కుమారి చెప్పుతో దాడి చేసింది. తనకు టికెట్ రాకుండా తండ్రి జయరాం, సోదరుడు అడ్డుపడుతున్నారని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. తన తండ్రి అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని, భూములను అన్యాయంగా కాజేశారని ఆరోపించారు.
ఇక తన తల్లికి మద్దతుగా మీనా కుమారి కుమారుడు పోస్టర్లు అంటించాడు. పోస్టర్లు ఎందుకు వేస్తున్నావని మేనల్లుడిని ప్రశ్నించి, అతనిపై జయరాం కుమారుడు చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో మీనా కుమారికి, ఆమె సోదరుడికి మధ్య విబేధాలు నెలకొన్నట్లు సమాచారం.
ఈ పరిణామాలపై జయరాంను విలేకరులు ప్రశ్నించగా, తన కూతురి వ్యాఖ్యలను తాను స్పందించనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, టికెట్ తమకే రావాలని కోరుకుంటారని, అందులో తప్పేమి లేదని జయరాం పేర్కొన్నారు.