టీమిండియా హెడ్ కోచ్ రేసులో సెహ్వాగ్‌తో పాటు వారిద్ద‌రు..!

  • Publish Date - November 23, 2023 / 02:00 AM IST

ప్ర‌స్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ ప‌దవీ కాలం పూర్త‌యింది. ఇక త‌దుప‌రి హెడ్ కోచ్ అనే అంశంపై గ‌త కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. రవిశాస్త్రి తరహాలో రాహుల్ ద్రవిడ్‌ పదవి కాలాన్ని పొడిగిస్తారా? లేక కొత్త కోచ్‌ను నియమిస్తారా? అనేది ఇప్పుడు క్రికెట్ వ‌ర్గాల‌లో హాట్ టాపిక్ అయింది. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఓటమి కార‌ణంగా ద్ర‌విడ్‌ని కొన‌సాగించే ఉద్దేశం లేద‌ని తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ద్రవిడ్ తప్పుకున్నా.. తప్పించినా.. టీమిండియా హెడ్ కోచ్ రేసులో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ముందు వ‌ర‌స‌లో ఉండ‌డం ఖాయం.

ఇక లక్ష్మ‌ణ్‌తో పాటు హెడ్ కోచ్ ప‌ద‌వికి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రేసులో ఉన్న‌ట్టు తెలుస్తుంది. వీవీఎస్ లక్ష్మణ్‌కు కోచ్‌గా చాలా అనుభవం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్‌గా తన కోచింగ్ మొదలుపెట్టాడు. 2021 వరకు మెంటార్‌గా సన్‌రైజర్స్‌కు సేవలు అందించిన లక్ష్మణ్ 2021లో బీసీసీఐ సూచనలతో ఎన్‌సీఏ డైరెక్టర్ పదవిని కూడా స్వీకరించాడు. ఇక వీరూ విష‌యానికి వ‌స్తే.. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కించుకున్నఇత‌నిని హెడ్‌కోచ్‌గా నియమిస్తే సౌతాఫ్రికా సిరీస్‌తోనే బాధ్యతలు స్వీకరిస్తాడు. రిటైర్మెంట్ ప్రకటించిన రెండేళ్ల నుంచే హెడ్ కోచ్‌గా పనిచేసేందుకు సెహ్వాగ్ చాలా ఆస‌క్తి చూపుతున్నాడు.

ఇక భారత మాజీ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లేకు టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అతని పర్యవేక్షణలోనే టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడింది. కానీ ఆటగాళ్ల పట్ల కఠినంగా ఉంటున్నాడని, అతని పర్యవేక్షణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే ఫిర్యాదులు రావడంతో కుంబ్లే‌ను తప్పించార‌నే ప్ర‌చారం అప్ప‌ట్లో నడిచింది. మ‌రి ఈ ముగ్గురిలో హెడ్ కోచ్‌గా ఎవ‌రు నియ‌మింప‌బ‌డ‌తారు, లేదంటే ద్ర‌విడ్‌నే కొన‌సాగిస్తారా అనేది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది.

Latest News