Site icon vidhaatha

జ్ఞాన్‌వాపీ మసీదు కేసులో తాజా అప్‌డేట్‌

అలహాబాద్‌ : జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంతంలో ఆలయం ఉండేదని, దానిని పునరుద్ధరించాలని వారణాసి కోర్టులో దాఖలైన పిటిషన్‌ను సవాలు చేసిన ఐదు పిటిషన్లను అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. వారణాసి కోర్టులో 1991లో దాఖలైన కేసును కొనసాగించవచ్చని, దీనికి ప్రార్థనాస్థలాల చట్టం 1991 వర్తించదని జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ తీర్పు చెప్పారు. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంతాన్ని సమగ్రంగా సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది.


జ్ఞాన్‌వాపి మసీదును సర్వే చేయాలని వారణాసి కోర్టు 2021 ఏప్రిల్‌ 8న ఇచ్చిన ఆదేశాలను కూడా అంజుమాన్‌ ఇంతెజామియా మసీద్‌ కమిటీ (ఏఐఎంసీ), ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డ్‌ సవాలు చేశాయి. వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయం సమీపాన ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణను ఏఐఎంసీ చూస్తున్నది. అయితే.. ఇక్కడ మందిరం ఉండేదని, దాన్ని పునరుద్ధరించాలని హిందూ పిటిషనర్లు కోరుతూ వారణాసి కోర్టులో దాఖలు చేసిన సూట్‌ చెల్లుబాటును ఏఐఎంసీ సవాలు చేసింది.


అయితే.. హిందువులు మాత్రం జ్ఞాన్‌వాపి మసీదు ఆలయంలో భాగమేనని వాదిస్తున్నారు. 1991 ప్రార్థనా స్థలాల చట్టం (ప్రత్యేక నిబంధనలు) ప్రకారం ఈ సూట్‌ చెల్లదని అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ, యూపీ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు వాదిస్తున్నాయి. 1947 ఆగస్ట్‌ 15 నాటికి వివిధ ప్రార్థనా స్థలాల స్వభావాన్ని యథాతథంగా కొనసాగించాలని 1991 ప్రార్థనా స్థలాల చట్టం చెబుతున్నది.

Exit mobile version