కుంభ­కో­ణంలో నా పాత్ర రుజువు చేస్తే.. రాజ­కీ­యాలు వది­లేస్తా

జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి చంపై సర్కారు విశ్వాస తీర్మానంలో నెగ్గింది. తీర్మానానికి మద్దతుగా 47, వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి.

  • Publish Date - February 5, 2024 / 09:46 AM IST

  • కేంద్రా­నికి, ఈడీకి మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌ సవాల్‌
  • విశ్వాసం నెగ్గిన జార్ఖండ్‌ సీఎం చంపై సొరేన్‌
  • ప్రభు­త్వా­నికి 47 మంది సభ్యుల మద్దతు
  • వ్యతి­రే­కిం­చిన 29 మంది ఎమ్మె­ల్యేలు
  • మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌ హాజరు

Hemant Soren : : జార్ఖండ్‌ ముఖ్య­మంత్రి చంపై సొరేన్‌ అసెంబ్లీ విశ్వా­సాన్ని పొందారు. ఆయన ప్రభు­త్వా­నికి మద్ద­తుగా 47 మంది సంకీర్ణ కూటమి సభ్యులు నిలు­వగా, ప్రతి­ప­క్షా­లకు చెందిన 29 మంది వ్యతి­రే­కంగా ఓటే­శారు. చంపై సొరేన్‌ విశ్వాస తీర్మా­నంలో విజయం సాధిం­చి­నట్టు గవ­ర్నర్‌ సీపీ రాధా­కృ­ష్ణన్‌ ప్రక­టిం­చారు. చంపై సభ విశ్వాసం పొంద­డంతో సభ్యులు బల్లలు చరిచి హర్షా­తి­రే­కాలు వ్యక్తం చేశారు. అనం­తరం సభను మరు­స­టి­రో­జుకు వాయిదా వేశారు.


మ్యాజిక్‌ ఫిగర్‌ 41

81 మంది సభ్యులు ఉన్న జార్ఖండ్‌ అసెం­బ్లీలో ప్రభుత్వ ఏర్పా­టుకు 41 మంది సభ్యుల మద్దతు అవ­సరం. అయితే.. ఓటిం­గ్‌కు ముందు చంపై సొరేన్‌ మాట్లా­డుతూ జేఎం­ఎంకు 47 మంది సభ్యుల మద్దతు ఉన్న­దని, ఓటింగ్‌ సమ­యంలో ఇది 50కి కూడా పెర­గ­వ­చ్చని వ్యాఖ్యా­నిం­చారు.


ఎన్ని­కైన ప్రభు­త్వాన్ని అస్థి­ర­పర్చే కుట్ర

చంపై సొరేన్‌ విశ్వాస తీర్మానం కోసం సోమ­వారం అసెం­బ్లీని ప్రత్యే­కంగా సమా­వే­శ­ప­ర్చారు. ఈ సంద­ర్భంగా విశ్వాస తీర్మా­నాన్ని ప్రతి­పా­దిస్తూ మాట్లా­డిన ముఖ్య­మంత్రి సొరేన్‌.. బీజే­పీపై తీవ్ర­స్థా­యిలో విరు­చు­కు­ప­డ్డారు. ప్రజా­స్వా­మ్య­యు­తంగా ఎన్ని­కైన ప్రభు­త్వాన్ని అస్థి­ప­ర్చేం­దుకు బీజేపీ ప్రయ­త్నిం­చిం­దని మండి­ప­డ్డారు. చేయని నేరా­నికి మాజీ ముఖ్య­మంత్రి హేమంత్‌ సొరే­న్‌ను ఇరి­కిం­చా­రని విమ­ర్శిం­చారు. కేంద్ర దర్యాప్తు సంస్థ­లను ఉప­యో­గిం­చు­కుని తప్పుడు కేసులో హేమంత్‌ సొరే­న్‌ను అరెస్టు చేయిం­చా­రని ఆరో­పిం­చారు. తన ప్రభుత్వం మాజీ ముఖ్య­మంత్రి హేమంత్‌ సొరేన్‌ పాల­నకు ద్వితీయ భాగ­మని చెప్పారు.


రుజువు చేస్తే రాజ­కీ­యాలు వది­లేస్తా

ఈడీ కస్ట­డీలో ఉన్న మాజీ ముఖ్య­మంత్రి హేమంత్‌ సొరేన్‌ కూడా పీఎం­ఎ­ల్‌ఏ కోర్టు అను­మ­తితో సోమ­వారం నాటి విశ్వాస పరీ­క్షకు హాజ­ర­య్యారు. విశ్వాస తీర్మా­నంపై చర్చలో భాగంగా హేమంత్‌ మాట్లా­డుతూ.. భూముల కుంభ­కో­ణంలో తన పాత్రను రుజువు చేయా­లని కేంద్రం­లోని బీజేపీ సర్కా­రుకు, ఎన్‌­ఫో­ర్స్‌­మెంట్‌ డైరె­క్ట­రే­ట్‌కు ఆయన సవాలు విసి­రారు. ‘వారు కనుక నిరూ­పిం­చ­గ­లి­గితే.. నేను రాజ­కీయ వది­లే­స్తాను’ అని ప్రక­టిం­చారు.

Latest News