Site icon vidhaatha

Hemant Soren | జేఎంఎం ఎమ్మెల్యేలపై బీజేపీ వల..జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌

పార్టీలను, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు
సమాజంలో విషాన్ని చిమ్ముతున్నారు

గొడ్డా (జార్ఖండ్‌): జేఎంఎం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు, సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆరోపించారు. జేఎంఎం నేత, మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌ బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో హేమంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గొడ్డా జిల్లాలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడిన హేమంత్‌ సోరెన్‌.. గిరిజనులు, దళితులు, వెనుకబడివర్గాలు, మైనార్టీల్లో విషం చల్లేందుకు, వారు పరస్పరం కొట్లాడుకునేందుకు గుజరాత్‌, అసోం, మహారాష్ట్ర నుంచి కొందరు వ్యక్తులను బీజేపీ జార్ఖండ్‌లో దించిందని ఆరోపించారు. ‘సమాజాన్ని వదిలేయండి.. వీళ్లు కుటుంబాలను, పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు. డబ్బు ఎంతటిదంటే.. రాజకీయ నాయకులను ఇక్కడి నుంచి అక్కడికి పంపడానికి ఎంతో సమయం పట్టదు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్న చంపై సోరెన్‌ ఆదివారం ఢిల్లీ వెళ్లటాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతా నుంచి ఢిల్లీకి చంపై వెళ్లారని ఆయన సన్నిహితుడొకరు తెలిపారు. జార్ఖండ్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయన్న హేమంత్‌ సోరెన్‌.. ‘పోల్‌ షెడ్యూల్‌ను మాత్రం ఎన్నికల కమిషన్‌ కాకుండా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు నిర్ణయిస్తాయి’ అని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థగా ఇప్పుడు లేదని, దానిని బీజేపీవాళ్లు ఆక్రమించేశారని హేమంత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘నేను వాళ్లకు (బీజేపీ) సవాలు విసురుతున్నా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. రేపీపాటికి వాళ్లు జార్ఖండ్‌ నుంచి తుడిచిపెట్టుకుపోతారు’ అని అన్నారు.

Exit mobile version