Site icon vidhaatha

Former CM of Jharkhand | జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి భావోద్వేగ ట్వీట్‌.. ఏం చెప్పారంటే..

Former CM of Jharkhand : తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తలను జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌ ఖండించినప్పటికీ.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. ఆదివారం ఢిల్లీకి వచ్చిన చంపై చేసిన ట్వీట్‌.. ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. ముఖ్యమంత్రిగా ఉన్న కొద్దికాలంలో తాను అనేక అవమానాలకు, ధిక్కారాలకు గురయ్యానని చంపై తన ట్వీట్‌లో తెలిపారు. అనివార్యంగానే తాను ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

పలు అనూహ్య ఘటనల తర్వాత తాను జనవరి 31న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించానని తెలిపిన చంపై.. ‘ముఖ్యమంత్రిగా నా పదవీకాలంలో మొదటి రోజు నుంచీ చివరి రోజు (జూలై 3) వరకూ రాష్ట్రం పట్ల నా బాధ్యతలను పూర్తి అంకిత స్వభావంతో నిర్వర్తించాను. హుల్‌ దివస్‌ తర్వాత నా రెండు రోజుల కార్యక్రమాలను పార్టీ నాయకత్వం వాయిదా వేసిందని తెలిసింది. అందులో దుంకాలో సభకూడా ఒకటి. పీజీటీ టీచర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఉన్నది. దీనిపై నేను ఆరా తీస్తే.. జూలై 3వ తేదీన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఉన్నదని, అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని తెలిసింది’ అని చంపై తెలిపారు.

‘ఒక ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని మరొకరు రద్దు చేశారంటే.. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానకరమైనది ఏమైనా ఉంటుందా?’ అని ఆయన తన ఎక్స్‌ ఖాతాలో ప్రశ్నించారు. ‘ఇంతటి అవమానాన్ని దిగమింగి కూడా.. శాసనసభాపక్ష సమావేశం మధ్యాహ్నం ఉన్నందున ఉదయం నియామక పత్రాలు అందిస్తానని చెప్పాను. కానీ.. దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. నా నాలుగు దశాబ్దాల మచ్చలేని రాజకీయ జీవితంలో ఆ రోజు నేను కుమిలిపోయాను. ఏం చేయాలో పాలుపోలేదు. రెండు రోజులు మౌనంగా కూర్చొని ఆత్మావలోకనం చేసుకున్నాను. ఈ మొత్తం వ్యవహారంలో నా తప్పేంటని ఆలోచించాను. నాకు పదవీకాంక్ష ఏ కోశానా లేదు. నాకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలి? నా సొంతవాళ్లే నాకు చేసిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలి?’ అని ఆయన తన పోస్టులో రాశారు. శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నా.. ఆ సమావేశం ఎజెండా ఏమిటో కూడా తనకు తెలియనీయలేదని వాపోయారు. ‘ఆ సమావేశంలో నన్ను రాజీనామా చేయాలని కోరారు. నేను ఆశ్చర్యపోయాను. నాకు అధికార కాంక్ష లేదు కాబట్టి.. వెంటనే రాజీనామా చేశాను. కానీ.. నా ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బకు నా హృదయం ముక్కలైంది’ అని పేర్కొన్నారు.

ఆఖరి మూడు రోజులు తన కన్నీళ్లు ఆపుకోలేక పోయానని చంపై తెలిపారు. ‘నా జీవితం మొత్తాన్నీ ధారబోసిన పార్టీలో నాకు స్థానం లేదని అర్థమైంది. ఈలోగానే అనేక అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిని ఇప్పుడు నేను ప్రస్తావించలేను. చాలా అవమానాలు, ధిక్కారాలు ఎదురైన తర్వాత.. ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని చంపై పేర్కొన్నారు. ‘నా జీవితంలో ఈ రోజు నుంచి కొత్త అధ్యాయం మొదలవుతుందని శాసనసభాపక్ష సమావేశంలో బరువెక్కిన గుండెతో చెప్పాను. నాకు మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడం, సొంత పార్టీని ఏర్పాటు చేసుకోవడం, తగిన వ్యక్తులు లభిస్తే.. వారితోపాటు కలిసి ప్రయాణించడం’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ.. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఈ అన్ని మార్గాలు నాకు తెరిచే ఉన్నాయి’ అని చంపై తెలిపారు.

 

Exit mobile version