హిందువులకు శుక్రవారం ఎంతో శుభప్రదమైన రోజు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేసి, తమకు సంపదనివ్వాలని కోరుకుంటారు. ఉన్న సంపదను కాపాడాలని ప్రార్థిస్తుంటారు. అంతేకాకుండా వ్యాపారం చేసేవారు శుక్రవారం తప్పకుండా తమ ఇంట్లో, కార్యాలయాల్లో, పని ప్రదేశంలో లక్ష్మీదేవికి తప్పకుండా పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని మనసారా పూజిస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల నమ్మకం. మరి లక్ష్మీకటాక్షం కావాలంటే.. లక్ష్మీదేవిని ఇలా పూజించాలి.
ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
ఇంట్లో వస్తువులు చిందర వందరగా లేకుండా చక్కగా సర్దుకోవాలి. పాత వస్తువులు, పగలిపోయిన, పనికిరాని సామాన్లు ఉంటే వాటిని ఇంటి బయట ఉంచాలి. ఇవన్నీ దరిద్రానికి చిరునామాలు. దుమ్ము లేకుండా చూడాలి. బూజులు ఎప్పటికప్పుడు దులుపుకోవాలి. ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది.
పూజా మందిరాన్ని కూడా..
ప్రతి ఇంట్లో పూజా మందిరం ఉంటుంది. దాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గదిలో అక్కర్లేని వస్తువులు ఉంచకూడదు. ప్రతి శుక్రవారం పూజా మందిరాన్ని శుద్ధమైన నీటితో కడిగి, దేవుళ్లను పూజించాలి. మీకు ఇష్టమైన ఇతర దేవుళ్ల ఫోటోలను కూడా పూజా మందిరంలో అమర్చుకోవచ్చు.
గడపకు పూజ చేయాలి..
ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు తెల్లవారుజామునే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలి. అనంతరం ఇంటి ముంగిట కలాపి నీళ్లు చల్లి, ముగ్గులు వేయాలి. ముగ్గు మధ్య భాగంలో పసుపు, కుంకుమ ఉంచాలి. ఆ తర్వాత గడపను శుభ్రంగా కడిగి పసుపు రాయాలి. కుంకుమతో గడపకు బొట్లు పెట్టాలి. ఇరువైపులా పువ్వులు ఉంచాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి.
లక్ష్మీపూజా విధానం..
పూజా మందిరంలో పసుపు, కుంకుమతో అలంకరించిన పీటపై లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచాలి. లక్ష్మీదేవికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి. అనంతరం ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఇంట్లో వారందరికి హారతి ఇవ్వాలి. ఇక ధూపం వేయాలి. దీంతో దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీ అష్టోత్తరం గాని, సహస్రనామాలు గాని మీ సమయానుసారం చదువుకోవాలి. చివరగా కొబ్బరికాయ, పళ్ళు ప్రసాదంగా అమ్మవారికి నివేదించాలి.