హైదరాబాద్ : అత్యంత కీలకమైన వార్షిక వృద్ధిరేటు 6శాతం ఉండి, జనాభా పెరుగుదల లేకపోతే 2047 నాటికి భారతదేశం దిగువ మధ్య ఆదాయ దేశంగానే ఉండిపోతుందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశం వేగంగా ఎదగకపోతే.. సంపన్న దేశం అయ్యేనాటికి జనాభా పరంగా వృద్ధ దేశంగా మారిపోతుందని చెప్పారు. అప్పుడు వృద్ధుల సంక్షేమ భారం కూడా తోడవుతుందని అన్నారు. గత రెండేళ్లుగా దేశ జీడీపీ వృద్ధి 7.5 శాతం వద్ద ఉన్నదని తెలిపారు. అందులోనూ కార్మికుల భాగస్వామ్యం చూస్తే చాలా తక్కువ ఉన్నట్టు తెలుస్తుందని చెప్పారు. ఇక జీడీపీ వృద్ధిలో మహిళల భాగస్వామ్యం జీ20 దేశాలతో పోల్చితే అత్యంత కనిష్ఠస్థానంలో ఉన్నదని అన్నారు.
24 ఏళ్లలో తలసరి ఆదాయం 8 లక్షలు
ఈ రోజు ఇండియా వృద్ధి అనేది ఏటా 6 శాతంగా ఉన్నదని చెప్పారు. దీని ప్రకారం లెక్కిస్తే.. ప్రతి పన్నెండేళ్లకు రెట్టింపు అవుతుందని, కనుక 24 ఏళ్లలో మన తలసరి ఆదాయాలు నాలుగురెట్లు పెరుగుతాయని వివరించారు. ప్రస్తుతం తలసరి ఆదాయం దేశంలో చాలా స్వల్పంగా సుమారు 2,500 డాలర్లు (రూ.2,07,504) ఉన్నదని తెలిపారు. దీనికి నాలుగింతలు అంటే.. 10వేల డాలర్లకు (రూ.8,30,015) పెరుగుతుంది. దీని ప్రకారం లెక్కిస్తే.. మన ప్రస్తుత వృద్ధిరేటు జీ 20 దేశాలతో పోల్చితే బలంగా ఉన్నప్పటికీ 2047 నాటికి భారతదేశం సంపన్న దేశంగా మారదని, దిగువ మధ్య ఆదాయ దేశంగానే ఉంటుందని రఘురాం రాజన్ వివరించారు.
అమెరికా తలసరి ఆదాయం 75,269 డాలర్లు
అమెరికా తలసరి ఆదాయం 75,269 డాలర్లుగా ఉన్నది. అంటే భారతీయ కరెన్సీలో దాని విలువ రూ.62,47,446. అమెరికా వృద్ధిరేటు 5.9 శాతం. ఈ లెక్కన భారతదేశం తన ఈ ఆరు శాతాన్ని కొనసాగించితే 24 ఏళ్ల తర్వాత తలసరి ఆదాయం సుమారు ఎనిమిది లక్షలు ఉంటే.. అమెరికా తలసరి ఆదాయం రూ.2,49,89,784కు చేరుకుంటుంది.