గాజా-ఇజ్రాయెల్‌ యుద్ధం మిగిల్చిన మానవ దుఃఖం

ఇజ్రాయిల్‌, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్నది. ముఖ్యంగా ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులతో గాజా పూర్తిగా ధ్వంసమౌతున్నది.

  • Publish Date - February 29, 2024 / 12:36 PM IST

ఇజ్రాయిల్‌, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్నది. ముఖ్యంగా ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులతో గాజా పూర్తిగా ధ్వంసమౌతున్నది. కొన్ని నెలలుగా నిరంతరంగా జరుగుతున్న దాడులతో గాజా ప్రాంతంలో నివసించే ప్రజలు చెల్లాచెదురయ్యారు. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు ప్రజలను తరలించి ఇజ్రాయిల్‌ సైన్యం చేస్తున్న దాడుల వల్ల వేలాది మంది పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. హమాస్‌ తీవ్రవాదుల ఏరివేత పేరుతో సాగుతున్న ఈ మారణహోమాన్ని జీనోసైడ్‌ అంటున్నారు. ఈ యుద్ధాన్ని వివిధ దేశాలు వ్యతిరేకించినప్పటికీ అగ్రరాజ్యం అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ ఈ దాడులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నది. అమెరికా ఒకవైపు గాజా భౌగోళిక స్వరూపాన్ని మార్చడానికి తాము సిద్ధంగా లేమని ప్రకటిస్తూనే.. ఈ దాడులను కొనసాగించడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నది. యుద్ధానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిగిన, తీర్మానం జరిగిన ప్రతిసారి అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి గాజాపై యుద్ధాన్ని కొనసాగించాల్సిందిగా.. సీజ్‌ ఫైర్‌ జరగడానికి వీల్లేదు అంటూ తన వైఖరిని ప్రదర్శిస్తున్నది.


ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగిన వాదనలో చైనా వెల్లడించిన అభిప్రాయం అత్యంత చర్చనీయాంశం అయ్యింది. చైనా పాలస్తీనా, ఆ దేశ ప్రజలవైపు అనుకూల నిర్ణయం తీసుకున్నది. ఇజ్రాయిల్‌ దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో అమెరికా వైఖరి వల్ల ఇజ్రాయిల్‌ అనేక దేశాలతో యుద్ధం చేస్తుండటంతో ఇది మినీ ప్రపంచయుద్ధాన్ని తలపిస్తున్నది. ఇదే సమయంలో రష్యా -ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరువైపులా లక్షలాదిమంది చనిపోయారు. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో దాదాపు ఐదు లక్షల మంది, రష్యాలో సుమారు లక్ష మంది చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. గాజాలో 35 వేలకు పైగా మంది చనిపోయారు. ఇందులో ఎక్కువమంది పిల్లలు, మహిళలు, వృద్ధులే ఉన్నారు. ఇటీవల ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన సారాంశాన్ని పరిశీలిస్తే వాళ్లు గాజా ప్రజలపై చేసే భయంకరమైన దాడి ప్రభావం ఎంతగా ఉండాలంటే ఇప్పుడు పుట్టిన బిడ్డల నుండి 80 ఏళ్ల ముసలి వారి వరకు ఇజ్రాయిల్ పేరు చెప్తేనే భయపడే పనికి పోయేంతగా తీవ్రాతి తీవ్రమైన దాడి చేస్తామని ఆమె ప్రకటించారు. ఇది జరగబోయే మారణ హోమానికి,జీనోసైడ్ ని కొనసాగిస్తామని చేసిన భయంకరమైన ప్రకటన.


ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం నిర్వహించిన సమావేశంలో సుమారు పది లక్షల మంది మహిళలు,పిల్లలు చాలా దుర్భరమైన స్థితిలో డేరాలలో, టెంట్లలో ఆశ్రయం పొందుతున్నారు. వారు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారని, కనీస మానవీయ సహాయం లేకుండా ఇబ్బంది పడుతున్నారని ఆ సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. ఇంత విషాదకరమైన యుద్ధంలో హమాస్‌ ఉగ్రవాదుల కంటే ఎక్కువగా నష్టపోయింది గాజాలో నివసిస్తున్న సామాన్య ప్రజలే. హమాస్‌కు నాయకత్వం వహిస్తున్న యహయా సిల్వర్ దొరికే వరకు దాడులు కొనసాగిస్తామని ప్రకటించిన ఇజ్రాయిల్‌ గాజా ప్రాంతంలోని ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రార్థనామందిరాలు వేటినీ వదిలిపెట్టడం లేదు. హమాస్‌ తీవ్రవాదులు లేదా ఆ సంస్థకు సంబంధించిన సాయుధులు టన్నెల్స్‌ అన్నీ కూడా ఈ ఆస్పత్రులు,పాఠశాలలు మసీదులు, జనావాస ప్రాంతాల నుంచి దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయిల్‌ ఆరోపిస్తూ .. వైమానిక దాడులతో వందలాది భవనాలను నేలమట్టం చేస్తున్నాయి. ఇది చాలా విషాదకరం. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అంతర్జాతీయ మీడియా, సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. ఇజ్రాయిల్ సైనిక దళాలు గాజాను ఎంత విధ్వంసం చేసామో తయారుచేసిన వీడియోను స్వయంగా విడుదల చేసి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి. అంతేకాదు ఇజ్రాయిల్ సైన్యంతో కలిసి అమెరికా బలగాలు సంయుక్తంగా పాలస్తీనా పై దాడులు చేస్తున్నట్టు ఆ దేశ నిఘా విభాగం అధికారికంగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది.



యుద్ధాన్ని ఎవరూ ఆహ్వానించకూడదు. యుద్ధం జరగకూడదని ప్రపంచ శాంతిని కోరుతున్నవారంతా చెబుతున్నారు. యుద్ధ పరిస్థితులు పేద, ధనిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ హింసకు గురిచేస్తాయి. వారి జీవితాలను ధ్వంసం చేస్తాయి. నిరాశ్రయులను చేస్తాయి. యుద్ధం వల్ల గాజా ప్రాంతంలోని ప్రజల పరిస్థితి ఎలా తయారైందంటే ఒక్క పూట కూడా తిండి దొరకని స్థితి నెలకొన్నది. ఒక నెటీజన్‌ తన భార్యకు ప్రసవానంతరం ఒక్క పూట భోజనం పెట్టడం కోసం దాడుల్లో కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులు చూస్తుంటే చాలా దయనీయమైన స్థితిలో ప్రజలు బతుకుతున్నారు. ఒక్క పూట మంచి భోజనానికి 90కి పైగా డాలర్లు ఖర్చుచేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉత్తర గాజాను ఖాళీ చేయించి మధ్య, దక్షిణ గాజాలో వీళ్లందరినీ కాన్‌సన్‌స్ట్రేషన్‌ క్యాంపుల్లో బంధించి అనేక రకాలుగా హింసిస్తున్నారని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. యుద్ధం వల్ల మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అక్కడి ప్రజలు మేము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ప్రజల జీవితం చెల్లా చెదురైపోయింది. తమ భవిష్యత్తు ఏమిటో తెలియని పరిస్థితిలోకి ఆ ప్రాంత ప్రజలు నెట్టి వేయబడ్డారు. యుద్ధం తెచ్చిన విధ్వంసంతో, మానవ దుఃఖాన్ని చూస్తున్నాం.


రంజాన్ నెల సందర్భంగా ఇజ్రాయిల్ కాల్పుల విరమణ పాటించే అవకాశం ఉంది. అరబ్ దేశాల ఒత్తిడితో అందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఒప్పుకునే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఆ 40 రోజులు ప్రజల జీవితాలు కొంత కుదుటపడే అవకాశం ఉన్నది. కానీ విధ్వంసమైన భవనాలు రవాణా వ్యవస్థలు మృగ్యమై తమ సొంత ప్రాంతంలోనే వలస వచ్చిన వారిగా జీవించాల్సిన దుస్థితి ఏర్పడింది.

21వ శతాబ్దంలో కూడా ఇలాంటి దయనీయ యుద్ధ భరిత వాతావరణంలో ప్రజలు జీవించడం మానవ నాగరికత పరిణామానికి మచ్చ.


– ఎర్రోజు శ్రీనివాస్‌

తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Latest News