Jamili Elections | ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై భారత లా కమిషన్ కూడా ఓ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లా కమిషన్ సమర్పించేందుకు సిద్ధమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
2024, 2029లో లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై విధివిధానాలను 22వ లా కమిషన్ రూపొందించినట్లు సమాచారం. ఈ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన సెప్టెంబర్ 23వ తేదీన కమిటీ తన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, విజిలెన్స్ కమిషనర్ మాజీ చీఫ్ సంజయ్ కొఠారీ హాజరై వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై చర్చించారు. జమిలి ఎన్నికలపై సూచనలు చేయడానికి లా కమిషన్, రాజకీయ పార్టీలను ఆహ్వానించి, చర్చించాలని కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే 2018లో జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలో ఏర్పాటైన 21వ లా కమిషన్ కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్రం ఆలోచనకు మద్దతు తెలిపింది. ఓ ముసాయిదాను కూడా కేంద్రానికి సమర్పించింది. తుది సిఫార్సులు చేయకముందే ఆ కమిషన్ పదవీ కాలం ముగిసింది. ఈ క్రమంలో 22వ లా కమిషన్ 2020, ఫిబ్రవరిలో మూడేండ్ల కాలపరిమితికి ఏర్పాటైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కమిషన్ పదవీకాలం ముగియడంతో, పదవీకాలాన్ని 2024, ఆగస్టు 31 వరకు పొడిగించింది కేంద్రం.