లేటరల్ ఎంట్రీతో 45 సీనియర్ పోస్టుల భర్తీ
ప్రైవేటుగా రిక్రూట్ చేసుకుంటామన్న యూపీఎస్సీ
కాంట్రాక్ట్ విధానం లేదా డిప్యూటేషన్‌పై నియామకం
పరీక్ష నిర్వహిస్తే సగం పోస్టులకు రిజర్వేషన్ వర్తింపు
లేటరల్ ఎంట్రీతో తెలివిగా వాటికి కేంద్రం ఎసరు
యూపీఎస్సీ నోటిఫికేషన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఎన్నకలప్పుడు రిజర్వేషన్లు ఎవరూ గుంజుకోలేరన్న మోదీ
ఎన్నికలు కాగానే.. బడుగుల హక్కులపై దాడి
ప్రైవేటీకరణతో ఇప్పటికే తగ్గిన రిజర్వేషన్లు
ఐఏఎస్‌ల ప్రైవేటీకరణ రిజర్వేషన్ల అంతానికే
ఇది ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గ్యారెంటీ
ఎక్స్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ : ఇప్పటిదాకా ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ వార్తలు విన్నాం.. ఇప్పుడు ప్రభుత్వాన్నే ప్రయివేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయా? కేంద్ర ప్రభుత్వంలోని 24 శాఖల్లో 45 మంది సీనియర్ అధికారుల నియామకానికి యూపీఎస్సీ (Union Service Public Commission) జారీ చేసిన నోటిఫికేషన్‌ను గమనిస్తే అవుననే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణతో బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. తాజాగా రిజర్వేషన్లతో సంబంధం లేకుండా వివిధ విభాగాల్లో సీనియర్ అధికారులుగా నేరుగా ప్రైవేటు రంగం నుంచి రిక్రూట్ చేసుకునేందుకు చర్యలు తీసుకోవడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. అందులోనూ ఈ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోరాదని స్పష్టంగా షరతు కూడా విధించారు.
పోటీ పరీక్ష ద్వారా నియామకాలు జరిపితే 45 పోస్టులకు గాను సగం పోస్టులు రిజర్వేషన్ల ప్రకారమే కేటాయించాల్సి ఉంటుంది. లేటరల్ ఎంట్రీ (lateral entry) కావడంతో రిజర్వేషన్ల ప్రస్తావనే రాదు. రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 2024 (LOKSABHA ELECTIONS) ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చ నడిచింది. రిజర్వేషన్ల ఎత్తివేతకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చివేస్తారనే ఆందోళనలూ వ్యక్తమయ్యాయి. ఫలితంగానే బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గి.. పదేళ్ల తర్వాత భాగస్వామ్య పక్షాల ఆసరాతో సంకీర్ణ ప్రభుత్వాన్ని (coalition government) బీజేపీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
అయినప్పటికీ.. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు వర్తింపజేయకుండా లేటరల్ ఎంట్రీ పేరుతో నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయడం తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది. పోటీ పరీక్షలు (competitive exams), రిజర్వేషన్ విధానం లేకుండా అంటే.. బీజేపీ తనకు నచ్చినవారిని నచ్చిన పోస్టులో కూర్చొనబెట్టుకుని, తమ ఆశ్రితులకు కావల్సిన పనులు చేయించి పెట్టడమేనని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు నిరుద్యోగం (unemployment) తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం లేటరల్ ఎంట్రీ పద్ధతిలో నియామకాలు చేయడానికి సంకల్పించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది లేటరల్ ఎంట్రీ కాదని, గుజరాత్, ఎంపీ, హర్యానా, యూపీ నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని నియమించుకుంటారని నిరుద్యోగులు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీన్నుంచి ఆరెస్సెస్ (RSS) వారే అధికంగా ప్రయోజనం పొందే అవకాశం ఉన్నదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేరుకు నోటిఫికేషన్ ఇచ్చినా.. ఇప్పటికే ఎవరెవరిని ఆయా పోస్టుల్లో నియమించాలో నిర్ణయం కూడా అయిపోయి ఉంటుందని పలువురు అనుమానాలు వెలిబుచ్చారు. రానున్న రోజుల్లో ప్రభుత్వరంగంలోకి కీలక పోస్టులన్నీ అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే ఉన్న స్థాయి పదవుల్లో బీజేపీ నేపథ్యాలు ఉన్న వారు నిండిపోతారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
45 పోస్టులకు రిజర్వేషన్ లేకుండా నియామకాలు
24 కేంద్ర మంత్రిత్వ శాఖల్లో జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, డైరెక్టర్ల హోదాలో 45 పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం (ఆగస్ట్ 18, 2024) ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్టు లేదా డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్న యూపీఎస్సీ.. ఈ పోస్టులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోరాదని షరతు విధించింది. ప్రైవేటురంగం నుంచే దరఖాస్తుల స్వీకరిస్తామని పేర్కొన్నది. ఇది బడుగు బలహీనవర్గాల హక్కు అయిన రిజర్వేషన్ విధానాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ ప్రకటన ప్రకారం.. పది జాయింట్ సెక్రటరీ, 35 డైరెక్టర్స్ / డిప్యూటీ సెక్రటరీ పోస్టులను సెప్టెంబర్ 17లోగా భర్తీ చేయాల్సి ఉన్నది.
రాజ్యాంగాన్ని చించిపారేస్తున్న బీజేపీ : ఖర్గే
యూపీఎస్సీ ప్రకటనపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రంగా మండిపడ్డారు. ‘దేశ రాజ్యాంగాన్ని బీజేపీ చించిపారేస్తున్నది. రిజర్వేషన్లపై ద్వంద్వ దాడి చేస్తున్నది. ఈ లేటరల్ ఎంట్రీ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి ఏమైనా రిజర్వేషన్ ఉన్నదా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను (SC, ST, OBC categories) రిజర్వేషన్‌కు దూరంగా ఉంచేందుకే బీజేపీ ఉద్దేశపూర్వకంగా పక్కా కుట్ర ప్రకారం ఇటువంటి నియామకాలు చేస్తున్నది’ అని ఆయన ఆరోపించారు. ‘ఉత్తరప్రదేశ్‌లో 69 వేల మంది అసిస్టెంట్ టీచర్లను నియామకంలో రిజర్వేషన్ స్కామ్ (reservation scam in appointment of 69,000 assistant teachers in UP) హైకోర్టు నిర్ణయంతో బయటపడింది. యూపీలో టీచర్ల నియామకాల కుంభకోణంపై 2024 మార్చిలోనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాన మంత్రి (Prime Minister)నరేంద్రమోదీకి లేఖ రాశారు’ అని గుర్తు చేశారు. ‘దేశ రాజ్యాంగం కల్పించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాలను పూర్తిగా అమలు చేయడం అవసరం. అందుకే సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కుల గణనను (caste census) డిమాండ్ చేస్తున్నది’ అని ఖర్గే చెప్పారు.
రిజర్వేషన్ల వ్యవస్థపై క్రూరమైన అపహాస్యం : తేజస్వి యాదవ్
కేంద్ర ప్రభుత్వ చర్య దేశ రాజ్యాంగం, రిజర్వేషన్ల వ్యవస్థపై (reservation system) క్రూరమైన అపహాస్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అభివర్ణించారు. ‘ఈ 45 పోస్టులను సంప్రదాయబద్ధమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేసి ఉంటే అందులో సగం అంటే సుమారు 22 నుంచి 23 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దక్కి ఉండేవి. కానీ.. లేటరల్ ఎంట్రీ విధానాన్ని ఎంచుకోవడం ద్వారా ఈ వర్గాల వాటా హక్కును ప్రభుత్వం సమర్థంగా నిరాకరించింది. ఇది వ్యవస్థాగతంగా ప్రణాళికాయుతంగా చేసిన తెలివైన చర్య’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అణగారిన వర్గాల రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని గత ఎన్నికల్లో ప్రధాని, బీజేపీ భాగస్వామ్యపక్షాల నాయకులు నమ్మబలికారని, కానీ.. ఇప్పుడు వారి హక్కులను దర్జాగా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. 90 శాతం మంది హక్కులను నిరాకరిస్తే ప్రజలు క్షమించబోరని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల అవకాశాలను కూడా లేటరల్ ఎంట్రీ పద్ధతి తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు.
ఏయే విభాగాల్లో పోస్టులు?
ఎమర్జింగ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, పర్యావరణ విధానాలు, చట్టాలు, డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్, సైబర్ సెక్యూరిటీ, ఆర్థిక రంగంలో పెట్టుబడులు, షిప్పింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉక్కు పరిశ్రమ కింద ఆర్థిక/ వాణిజ్య/ పరిశ్రమలకు సంబంధించి, పునర్వినియోగ ఇంధనం, విధానాలు, ప్రణాళిక, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథార్టీలో జాయింట్ సెక్రటరీ పోస్టులకు ఈ ప్రకటన కింద నియామకాలు చేపట్టనున్నారు. డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులకు సంబంధించి.. పర్యావరణ మార్పు, అటవీ, సమీకృత పోషకాల నిర్వహణ, సహజ వ్యవసాయం, వర్షాధార వ్యవసాయ విధానం, సేంద్రియ వ్యవసాయం, పట్టణ నీటి నిర్వహణ, విమానయాన నిర్వహణ, రసాయనాలు, పెట్రో రసాయనాలు, వస్తువుల ధర నిర్ణయం, దివాలా, విద్యా చట్టాలు, విద్యా సాంకేతికత, అంతర్జాతీయ చట్టం, ఆర్థిక, పన్ను విధానం, తయారీ/ ఆటోమొబైల్ రంగం, అధికారిక భాషలు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో డిజిటల్ మీడియా కోసం ఆటో, అధునాతన కెమికల్ సెల్ బ్యాటరీ తయారీ తదితర రంగాలు ఉన్నాయి. ఈ పోస్టుల్లో మూడు నుంచి ఐదేళ్లపాటు ఉద్యోగం ఉంటుంది. జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలను లేటర్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో నియమించుకునేందుకు 2018లోనే నాటి బీజేపీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ ఈ పద్ధతిలో 63 నియామకాలు చేపట్టినట్టు లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అందులో ఇప్పటికీ 57 మంది తమ సర్వీసులలో కొనసాగుతున్నారు.
బడుగు వర్గాలపై దాడి ఇది.. బహుజనుల రిజర్వేషన్లు గుంజుకుంటున్న బీజేపీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
లేటరల్ ఎంట్రీ పద్ధతిలో నియామకాల అంశం విషయంలో బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన విమర్శల దాడిని సోమవారం కూడా కొనసాగించారు. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి చేయడమేనని ఆరోపించారు. బహుజనుల రిజర్వేషన్లను గుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు, బహుజనుల రిజర్వేషన్లు గుంజుకునేందుకు బీజేపీ.. రామరాజ్యం అర్థాన్ని మార్చివేసిందని ఎక్స్‌లో ఆరోపించారు. ఆదివారం కూడా ఇదే అంశంపై ఎక్స్‌లో స్పందించిన రాహుల్ గాంధీ.. లేటరల్ ఎంట్రీ జాతి వ్యతిరేకమైన చర్య అని అభివర్ణించారు. ఐఏఎస్‌ల ప్రైవేటీకరణ.. రిజర్వేషన్ల అంతానికి మోదీ ఇస్తున్న గ్యారెంటీ అని రాహుల్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యను ఇండియా కూటమి గట్టిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.