Osmania University Civil Service Academy : ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీస్ అకాడమీలో సివిల్స్, ఇతర పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఓయూలో పీజీ, పీహెచ్ డీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం యూపీఎస్సీ సివిల్స్ (ప్రిలిమ్స్), గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర పోటీ పరీక్షల కోసం జనరల్ స్టడీస్‌లో ఉచిత శిక్షణ అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ తెలిపారు. దరఖాస్తుల వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ లో పొందుపరిచామని, ఆసక్తిగల యూనివర్సిటీ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు.
దరఖాస్తు ఫారంలో సూచించిన పత్రాలను దరఖాస్తుకు జత చేసి ఉస్మానియా యూనివర్సిటీ అకాడమీలో 2025, జూన్ 30వ తేదీ లోపు సమర్పించాలని తెలిపారు. విద్యార్థుల రెగ్యులర్ క్లాసులకు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సివిల్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్ వెల్లడించారు. ఇతర వివరాల కోసం విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ సివిల్స్ అకాడమీని సంప్రదించవచ్చని తెలిపారు.